జలయజ్ఞ సృష్టికర్తకు ..జలాభిషేకం
1 min read
అభివృద్ధి.. సంక్షేమానికి చిరునామా డాక్టర్ వైయస్సార్
- పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్సార్
- వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి
- ఘనంగా వైఎస్సార్ వర్ధంతి వేడుకలు
అన్నమయ్య జిల్లా సెప్టెంబర్ 2 (న్యూస్ నేడు ప్రతినిధి) : తెలుగు ప్రజల గుండె చప్పుడు… పేదల ఆశాజ్యోతి… రైతన్నకు ఆత్మబంధువు… జలయజ్ఞానికి రూపశిల్పి… అభివృద్ధి, సంక్షేమానికి కొత్త అర్థం చెప్పిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం రాయచోటి పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రింగ్ రోడ్డులోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జలయజ్ఞం ద్వారా రాష్ట్రంలో ప్రాజెక్టులకు జీవం పోసిన మహానేతకు, ఆయన సంకల్పంతో సాకారమైన వెలిగల్లు జలాశయ జలాలతో ప్రత్యేక జలాభిషేకం నిర్వహించడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా… ఆయన పేరు ప్రజల గుండెల్లో సజీవంగా ఉందని, ఆయన చూపిన అభివృద్ధి మార్గం నేటికీ రాష్ట్రానికి దిక్సూచిగా నిలుస్తోందని అన్నారు. పేదవాడి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని భావించి ఆరోగ్యశ్రీని, అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు 108 అంబులెన్స్ సేవలను, గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు చేరువ చేసేందుకు 104 సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన దార్శనికుడు వైఎస్సార్ అని కొనియాడారు. రైతు సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని నమ్మిన మహానేత, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి పథకాలతో అన్నదాతకు అండగా నిలిచారని పేర్కొన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా భరోసా కల్పించి, విద్యను నిరుపేదలకు చేరువ చేశారని గుర్తు చేశారు.
రాయచోటిపై ప్రత్యేక మమకారం
రాయచోటి ప్రాంత ప్రజలంటే మహానేత వైఎస్సార్‌కు ప్రత్యేకమైన ప్రేమ, మమకారం ఉండేదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పట్టణ దాహార్తిని తీర్చేందుకు నీటి పథకాలు చేపట్టడమే కాకుండా, రింగ్ రోడ్డు, పాలిటెక్నిక్ కళాశాల, పలు విద్యాసంస్థలు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.రాయచోటి అభివృద్ధి కోసం మహానేత వేసిన పునాదులు నేటికీ ప్రజల కళ్లముందు కనిపిస్తున్నాయని అన్నారు.
పేదల పాలిట దేవుడు… అపర భగీరథుడు
రైతును రాజుగా చూడాలి… పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి… అన్న ఆశయంతో పాలించిన నాయకుడు వైఎస్సార్ అని పేర్కొన్నారు.పేదలకు గృహాలు, విద్యార్థులకు ఉన్నత విద్య, రైతులకు భరోసా, నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత మహానేతకే దక్కుతుందని కొనియాడారు.అందుకే వైఎస్సార్‌ను ప్రజలు కేవలం ఒక ముఖ్యమంత్రిగా కాకుండా తమ ఇంటి పెద్దగా, ఆపద్బాంధవుడిగా, పేదల పాలిట దేవుడిగా భావించారని తెలిపారు.
మహానేత ఆశయాలు సజీవం..
వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, ఆలోచనలు, అభివృద్ధి అడుగుజాడలు ఎప్పటికీ చెరగిపోవని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రతి పేదవాడి ఇంట్లో వెలిగిన ఆశ… ప్రతి రైతు గుండెల్లో నింపిన ధైర్యం… ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు వేసిన పునాది… ప్రతి జలాశయంలో ప్రతిఫలించిన జలయజ్ఞం… ఇవన్నీ మహానేత వైఎస్సార్ చిరస్మృతులేనని పేర్కొన్నారు.
జోహార్ వైఎస్ఆర్ నినాదాలతో మార్మోగిన రాయచోటి
జోహార్ వైఎస్ఆర్.. మహానేత ఆశయాలే మా మార్గం ..వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు మార్మోగాయి.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, మాజీ వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్, మాజీ డిసిసిబి డైరెక్టర్ సేఠ్ వెంకట్రామిరెడ్డి, పట్టణ కన్వీనర్ నవాజ్, నాయకులు అష్రఫ్ అలీఖాన్, బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయభాస్కర్, నియోజక వర్గ బిసి సెల్ కన్వీనర్ నాగరాజు యాదవ్, వైస్ ఎంపిపి శ్రీధర్ రెడ్డి,మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి షబ్బీర్, నాయకులు ఎస్ పి ఎస్ రిజ్వాన్, ఫయాజ్ అహమ్మద్, కొలిమి ఛాన్ బాష, సాదిక్, గౌస్ ఖాన్, సుగవాసి శ్యామ్,అల్తాఫ్, అన్నా సలీం, మున్సిపల్ విభాగపు రాష్ట్ర కార్యదర్శి రియాజుర్ రెహమాన్, జనతా బషీర్, టెలికాం సలహా కమిటీ భ్యుడుఅబుజర్ , వెంకట్రామిరెడ్డి, నవరంగ్ నిస్సార్, ఖళీళ్ బేగ్, రైతుమిత్ర ఖాదర్ బాష, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, హుసేన్, పేయల శివశంకర్ యాదవ్, పట్టణ ఉపాధ్యక్షుడు నాగేంద్ర ,చిన్న సంజీవయ్య, కొత్తిమీర ప్రసాద్, గోపాల్ రెడ్డి, అష్రఫ్, ,జేసిబి ప్రతాప్ రెడ్డి,జయచంద్రా రెడ్డి, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి ఇంతియాజ్, నాదర్, తాజ్, ఫైరోజ్,అష్రఫ్, మాజీ కో ఆప్షన్ హజరత్ ఖాదర్ వలీ,అమీర్ తదితరులు పాల్గొన్నారు.



