వర్జినియా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలి
1 min read
కిలో పొగాకుకు సరాసరి ధర రూ.380 ఇవ్వాలి
పొగాకు రైతులకు పొగ పెట్టవద్దు
పొగాకు కొనుగోలుకు పొగాకు బోర్డు రూ.1000 కోట్లు కేటాయించాలికేటాయించాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కొయ్యలగూడెం( త్రినాధపురం) వర్జీనియా పొగాకు కొనుగోలుకు పొగాకు బోర్డు నిధుల నుండి రూ.1000 కోట్లు కేటాయించి, రైతులు వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేయాలని, కిలో వర్జీనియా పొగాకుకు సరాసరి ధర రూ.380 ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం కొయ్యలగూడెం మండలం త్రినాధపురంలో వర్జీనియా పొగాకు రైతుల సమావేశం నిర్వహించారు. పొగాకు రైతుల సమస్యలపై చర్చించి గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేపట్టాలని తీర్మానించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కంపెనీలు, బోర్డు అధికారులకు కుమ్ముక్కై పొగాకు రైతులకు పొగ పెడుతున్నారని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. పొగాకు రైతులకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రాక తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని, కష్టపడి పండించిన పొగాకు అమ్ముడుపోక ఇళ్ల దగ్గరే నిల్వ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరాకు మూడు లక్షల 70 వేల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారని, పెట్టుబడి కి తెచ్చిన అప్పులు తీర్చే పరిస్థితి లేదన్నారు. కొనుగోళ్లు మందకొండిగా జరిగితే రైతుల నష్టాలు మరింత పెరుగుతాయన్నారు. పొగాకు బోర్డు ముట్టడి కార్యక్రమం సందర్భంగా బోర్డు చైర్మన్ ఇచ్చిన హామీ ప్రకారం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. పొగాకు రైతులు న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా నాయకులు శుక్ల బోయిన రాంబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆత్కూరి వీర్రాజు మాట్లాడుతూ పొగాకు రైతులను అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో వర్జీనియా పొగాకు రైతులు యాగంటి కృష్ణ, తిరుమలశెట్టి శ్రీనివాస్,బసిరెడ్డి కేదారేశ్వరరావు,తిరుమల శెట్టి రాజేష్, యాగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


