సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలి
1 min read
ప్రతి అంశంలో సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలి
బనగానపల్లెలో ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
బనగానపల్లె/నంద్యాల న్యూస్ నేడు: ఈ నెల 9వ తేదీన బనగానపల్లెలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ షోరాన్, ముఖ్యమంత్రి పర్యటన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్‌తో కలిసి హెలిప్యాడ్, సభా ప్రాంగణం, ప్రజావేదిక, పార్కింగ్ ప్రాంతాలు, తహసీల్దార్ కార్యాలయం, రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించే ప్రదేశాలను సందర్శించి ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని, ప్రతి ఏర్పాటును అత్యంత నాణ్యతతో, సమయపాలనతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి చిన్న లోపానికీ తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి సభకు వేలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు, విద్యుత్ సరఫరా, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు, షామియానాలు, కూర్చునే ఏర్పాట్లు, తగిన బ్యారికేడింగ్ తదితర అన్ని మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు సూచించారు.భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, ట్రాఫిక్ నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సులభంగా రాకపోకలు సాగించేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. పోలీసు, రెవెన్యూ, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్, వైద్య ఆరోగ్య, ఆర్‌డబ్ల్యూఎస్‌తో పాటు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రతి ఏర్పాటును నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తూ ప్రతి అంశాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలను సమీక్షించనున్న నేపథ్యంలో కార్యాలయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని, సంబంధిత అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.అనంతరం ముఖ్యమంత్రి రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు, సూచనలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నందున రైతుల సమావేశం సజావుగా సాగేలా వేదిక, సమావేశ నిర్వహణ, కూర్చునే ఏర్పాట్లు, తాగునీరు, భద్రత, ఇతర మౌలిక సదుపాయాలను పకడ్బందీగా సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ప్రతి పనిని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి, కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, విద్యుత్, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

