విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి – ఎస్సై దిలీప్ కుమార్
1 min read
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు
హోళగుంద న్యూస్ నేడు : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దిలీప్ కుమార్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు సరైన ప్రణాళికతో కృషి చేయాలని సూచించారు. చదువును భారంగా కాకుండా ఆసక్తితో, ఇష్టంతో అభ్యసిస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని అన్నారు. ప్రతి విద్యార్థి సమయపాలన, క్రమశిక్షణ, మంచి నడవడికను అలవర్చుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు.అలాగే నేటి సమాజంలో జరుగుతున్న వివిధ నేరాలు, వాటికి చట్టంలో ఉన్న శిక్షలు, మహిళల పట్ల గౌరవంగా ఎలా ప్రవర్తించాలి, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి, చట్టాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అనే అంశాలపై విద్యార్థులకు వివరంగా అవగాహన కల్పించారు. యువత మంచి మార్గంలో పయనిస్తూ తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, నైతిక విలువలు, బాధ్యతాయుతమైన ప్రవర్తన, సామాజిక స్పృహతో ముందుకు సాగితే వ్యక్తిగత జీవితంతో పాటు సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడగలరని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



