పులి కోసం అత్యంత జాగ్రత్తగా అటవీ శాఖ అధికారుల ముమ్మర అన్వేషణ
1 min read
వివిధ టైగర్ రిజర్వ్లనుండి అనుభవజ్ఞులైన ప్రత్యేక బృందాలను రంగంలోకి
జిల్లా అటవీ శాఖాధికారి పి.వి. సందీప్ రెడ్డి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లాలో పులి కోసం అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా అన్వేషిస్తున్నారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చింతూరు, పాపికొండ నేషనల్ పార్క్ ప్రాంతాలలో సంచరిస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసిందని జిల్లా అటవీ శాఖాధికారి పి .వి. సందీప్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే మహారాష్ట్ర (వార్ధా, పుణే) బృందాలతో పాటు బెంగళూరు నుండి ‘వైల్డ్‌లైఫ్ SOS’ (Wildlife SOS) నిపుణుల బృందాన్ని, వార్ధా నుండి ‘పీపుల్ ఫర్ యానిమల్స్’ (People for Animals) బృందాన్ని మరియు వివిధ టైగర్ రిజర్వ్‌ల నుండి అనుభవజ్ఞులైన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామన్నారు. మత్తుమందు తుపాకీలతో పులిని బంధించడంలో నైపుణ్యం ఉన్న ఆరుగురు (6) ట్రాంక్విలైజింగ్ షూటర్లను సిద్ధంగా ఉంచామన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తాను, రాజమండ్రి అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ డా. టి. జ్యోతి క్షేత్రస్థాయిలో పర్యటించి ఆపరేషన్‌ను పరిశీలించామన్నారు. పులి చాలా చురుగ్గా, చాకచక్యంగా ప్రవర్తిస్తూ మానవ సంచారం ఉన్న ప్రాంతాలను మరియు ప్రత్యేకంగా అమర్చిన మంచెలను (Machan) గమనిస్తూ తప్పించుకుంటూ ప్రయాణిస్తోందని, అయినప్పటికీ, నిపుణుల బృందాలు పక్కా వ్యూహంతో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయన్నారు. పులి ముందుకు సాగే సాధ్యమయ్యే మార్గాలను కవర్ చేస్తూ సరిహద్దు ప్రాంతాలలో యూ ఆకారంలో గాలింపు కొనసాగిస్తున్నామన్నారు. ఈ ప్రత్యేక నమూనాలతో పాటు థర్మల్ డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు మరియు నిపుణులైన ట్రాకింగ్ టీమ్‌లతో అన్ని రకాల సాంకేతిక పద్ధతులను వినియోగిస్తున్నామన్నారు. వలలతో చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ వేస్తూ, పులిని నిర్దేశిత మార్గంలోకి డ్రైవ్ చేస్తున్నామన్నారు. ప్రతిరోజూ పులి సంచారాన్ని నిరంతరం ట్రాక్ చేస్తూ దర్భగూడెం, పి. రాజవరం, చెల్లావారిగూడెం, ఎ. పోలవరం, అప్పలరాజుగూడెం, సిరివారిగూడెం, రామన్నపాలెం, మడకవారిగూడెం, దాట్లవారిగూడెం, శ్రీరత్నగూడెం, సీతాంపేట మరియు సమీప గ్రామాల ప్రజలను డప్పు చాటింపులు (Tom-Tom) మరియు మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా అప్రమత్తం చేస్తున్నామన్నారు. కన్నాపురం, పోలవరం, కుకునూరు మరియు జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజ్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పూర్తి అప్రమత్తతతో ఉన్నామని, ప్రజలు కూడా భయాందోళన చెందకుండా అటవీ శాఖ సూచనలు పాటిస్తూ సహకరించాలని సందీప్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


