2025 డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ చేపట్టాలి: మాజీ ఎమ్మెల్యే
1 min read
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, మాజీ ఎంపీపీ ఎస్. నాగరత్నమ్మ
న్యూస్ నేడు, పత్తికొండ: 2025 డీఎస్సీ నియామకాల ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలపై వెంటనే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, పత్తికొండ మాజీ ఎంపీపీ ఎస్ నాగరత్నమ్మ డిమాండ్ చేశారు. గురువారం పత్తికొండ పట్టణంలో డీఎస్సీ నియామకాల లో జరిగిన ఒకటవకులపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ వైసిపి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వేలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు. డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధపడకపోతే, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ వారి పక్షాన నిలబడి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ దీక్షల్లో డీఎస్సీలో నష్టపోయిన నిరుద్యోగ యువతతో కలిసి మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ గారు, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ గారు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివి, డీఎస్సీ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్ననిరుద్యోగయువతకు అన్యాయం జరిగితే వారి భవిష్యత్తుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి తన శాఖకు సంబంధించిన ఆరోపణలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.



