విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి
1 min read
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ
నంద్యాల, న్యూస్ నేడు : వినాయక చవితి పర్వదినాన్ని జిల్లా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, రాష్ట్ర రోడ్లు-భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఆకాంక్షిస్తూ జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సైతం జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విఘ్నేశ్వరుని అనుగ్రహంతో ప్రతి ఇల్లు సుఖసంతోషాలు, సౌభాగ్యాలతో కళకళలాడాలని, ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, ఆనందంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాలు మరింత ఫలవంతం కావాలని వారు ఆకాంక్షించారు.వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో, ఆనందోత్సాహాలతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ జరుపుకోవాలని సూచించారు. పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయక విగ్రహాలను వినియోగిస్తూ పండుగను పర్యావరణహితంగా నిర్వహించడం ద్వారా ప్రకృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


