పత్తికొండలో సీపీఎం కరువు బృందం పర్యటన
1 min read
కరువును రాష్ట్ర విపత్తుగా ప్రకటించి రైతులకు తక్షణ పరిహారం ఇవ్వాలి: కే. లోకనాథం
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గంలో సీపీఎం కేంద్ర కమిటీ కరువు బృందం సోమవారం విస్తృతంగా పర్యటించింది. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు కే. లోకనాథం, రాధాకృష్ణ, ఆనంద్‌బాబు, అంజిబాబు తదితరులు దేవనకొండ మండలంలోని ఈదుల దేవరబండ, కప్పట్రాళ్ల గ్రామాల్లో పర్యటించి పండ్లతోటలు, సాగు పంటలను పరిశీలించారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం పత్తికొండలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కే. లోకనాథం మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి, టమాటా, మిరప, ఆముదం, సద్ద, జొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. పంటలు సాగు చేసిన రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని తెలిపారు.కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కరువును రాష్ట్ర విపత్తుగా ప్రకటించాలని, రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1 లక్ష కోట్ల సహాయం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కరువు ప్రభావిత ప్రాంతాలకు తక్షణ కరువు పరిహారం అందించాలని కోరారు. రైతులకు పంట నష్టపరిహారం, పశుగ్రాసం, తాగునీరు, ఉపాధి పనిదినాలు పెంపు వంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.కరువు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పర్యటించి రైతుల పరిస్థితులను తెలుసుకుంటున్నామని, వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాటం చేస్తామని సీపీఎం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి తదితరులు పాల్గోన్నారు.


