NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

1 min read

భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత.. 30 పడకల వైద్య సదుపాయం, 8 అంబులెన్సులతో అత్యవసర సేవలు

110 వీడియో కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ.. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

హోళగుంద న్యూస్ నేడు : హోళగుంద మండలం దేవరగట్టు గ్రామంలో నిర్వహించనున్న శ్రీ మాళ మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. బన్నీ ఉత్సవాలకు సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల భద్రత, వైద్య సేవలు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, రహదారులు, రవాణా, అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.బుధవారం దేవరగట్టు ఆలయ ప్రాంగణంలో సమీప గ్రామాల ప్రజలు, ఆలయ పెద్దలు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఉత్సవాల ఏర్పాట్లను సమీక్షించి పలు కీలక సూచనలు చేశారు.

భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి మాట్లాడుతూ.. బన్నీ ఉత్సవాలకు వచ్చే భక్తులకు అత్యవసర సమయాల్లో తక్షణ వైద్య సేవలు అందించేందుకు గతంలో ఉన్న 20 పడకల వైద్య సదుపాయాన్ని 30 పడకలకు పెంచాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అంబులెన్సుల సంఖ్యను రెండింటి నుంచి ఎనిమిదికి పెంచి ఉత్సవాలు ముగిసే వరకు నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు. అవసరమైన వైద్య సిబ్బంది, మందులు, వైద్య పరికరాలను సిద్ధంగా ఉంచడంతోపాటు రెండు అగ్నిమాపక యంత్రాలు, ఫైర్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపారు.

తాగునీరు, విద్యుత్, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

ఉత్సవాలకు వచ్చే భక్తులకు తాగునీటి కొరత లేకుండా నీటి సరఫరా సామర్థ్యాన్ని ఆరు లక్షల లీటర్లకు మించి పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధాన ఉత్సవ ప్రాంగణంతోపాటు పార్కింగ్ ప్రాంతాల్లోనూ ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆలయ పరిసరాలు, భక్తులు రాకపోకలు సాగించే ప్రధాన మార్గాల్లో తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు జనరేటర్లను సిద్ధంగా ఉంచాలన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ.. దేవరగట్టు బన్నీ ఉత్సవాలను సంప్రదాయాలకు అనుగుణంగా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, గ్రామస్థులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఉత్సవ ప్రాంతంలో బారికేడింగ్, లైటింగ్, సీసీ కెమెరాలు, నెట్‌వర్క్ వ్యవస్థలను పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు.

శ్రీ మాళ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్, ఎస్పీ

సమీక్ష సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మెట్ల మార్గం ద్వారా ఆలయానికి చేరుకుని శ్రీ మాళ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆదోని ఆర్డీవో అరుణ దేవి, ఆదోని అదనపు ఎస్పీ జయ శర్మ, ఆదోని డీఎస్పీ వంశీధర్ గౌడ్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వర రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మనోహర్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ చంద్రారెడ్డి, డీఎంహెచ్‌ఓ కామేశ్వర ప్రసాద్, డీసీహెచ్‌ఎస్ జఫ్రుల్లా, ఎక్సైజ్ డీసీ శ్రీధర్ బాబు, విద్యుత్ శాఖ డీఈ సుబ్బన్న, దేవరగట్టు ఆలయ చైర్మన్ వీర నాగప్ప, ప్రధాన పూజారి గిరి మల్లేష్‌తోపాటు అగ్నిమాపక శాఖ, అటవీశాఖ అధికారులు, ఇతర శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *