రవీంద్ర జూనియర్ కళాశాలలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు:ప్రముఖ శాస్త్రవేత్త మేరీ క్యూరీ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 7న నిర్వహించే జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని కర్నూలులోని రవీంద్ర జూనియర్ కళాశాల బాలికల విభాగంలో, కృష్ణా నగర్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించారు.2014 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్న ఈ అవగాహన కార్యక్రమంలో సుమారు 300 మంది విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, స్క్రీనింగ్ పరీక్షలు, వివిధ చికిత్సా విధానాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. క్యాన్సర్‌కు సంబంధించిన ప్రమాద కారకాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యత, వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్సా ఫలితాలు సాధించవచ్చనే అంశాలను వివరించారు.డాక్టర్ సి. వాసు రెడ్డి మాట్లాడుతూ, క్యాన్సర్ అనేది అన్ని సందర్భాల్లో ప్రాణాంతకమైన వ్యాధి కాదని, ప్రారంభ దశలో గుర్తించిన అనేక క్యాన్సర్లకు సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. క్యాన్సర్‌పై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, తమ కుటుంబ సభ్యులకు మరియు సమాజానికి అవగాహన కల్పించాలని విద్యార్థినులకు సూచించారు.ఈ కార్యక్రమంలో రవీంద్ర బాలికల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జ్యోతి, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ కె. అరుణ, రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ ఫీల్డ్ ఆఫీసర్ రమేష్ పాల్గొన్నారు.యువతలో క్యాన్సర్ నివారణ మరియు ముందస్తు గుర్తింపుపై అవగాహన పెంపొందించడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడవచ్చని కార్యక్రమంలో పేర్కొన్నారు.


