బాణసంచా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి
1 min read
– మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు వైద్యుల సూచనలు
కర్నూలు, న్యూస్ నేడు: దీపావళి పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలంటే బాణసంచా వినియోగంలో తగిన జాగ్రత్తలు పాటించాలని మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు వైద్యులు సూచించారు. దీపావళి సందర్భంగా ప్రజల్లో భద్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు మెడికవర్ హాస్పిటల్స్‌లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డా. శశి కిరణ్, నియోనటాలజిస్ట్ & పీడియాట్రిషియన్ డా. సింధూర, పీడియాట్రిషియన్ డా. అనుష పాల్గొని దీపావళి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రసంగించారు.డా. శశి కిరణ్ మాట్లాడుతూ, బాణసంచా పేలుళ్ల వల్ల వచ్చే అధిక శబ్దం చెవులపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అధిక శబ్దానికి దూరంగా ఉండాలని సూచించారు. బాణసంచా కాల్చే సమయంలో చెవులకు రక్షణ కల్పించుకోవాలని, చెవుల్లో అకస్మాత్తుగా వినికిడి తగ్గడం లేదా నొప్పి వంటి సమస్యలు తలెత్తితే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.డా. సింధూర మాట్లాడుతూ, పసిపిల్లలు, చిన్నారులను బాణసంచాకు దూరంగా ఉంచాలని తెలిపారు. బాణసంచా కాల్చే ప్రదేశాల్లో చిన్నారులను ఒంటరిగా వదిలేయకూడదని, పెద్దల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. పొగ వల్ల శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు కలగవచ్చని, చిన్నపిల్లలు, నవజాత శిశువులను అధిక పొగ, శబ్దం ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లకుండా జాగ్రత్తపడాలని తెలిపారు.డా. అనుష మాట్లాడుతూ, బాణసంచా కాల్చేటప్పుడు పిల్లలు తప్పనిసరిగా పెద్దల పర్యవేక్షణలో ఉండాలని, మండుతున్న టపాసుల దగ్గరకు వెళ్లకుండా చూడాలని సూచించారు. బాణసంచా కాల్చిన వెంటనే వాటిని చేతితో తాకకూడదని, పేలని టపాసులను మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయకూడదని తెలిపారు. కాలిన గాయాలు లేదా ప్రమాదాలు జరిగినప్పుడు ఇంటి వద్దే చికిత్సకు పరిమితం కాకుండా అవసరమైన వైద్య సహాయం పొందాలని సూచించారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “దీపావళి ఆనందం, వెలుగుల పండుగ. అయితే పండుగ వేడుకల సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు దారితీయవచ్చు. ముఖ్యంగా పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బాణసంచా వినియోగంలో జాగ్రత్తలు పాటిస్తూ, ఇతరులకు ఇబ్బంది కలగకుండా పర్యావరణం, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పండుగను జరుపుకోవాలి” అని తెలిపారు.ప్రజలందరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ప్రమాదాలకు దూరంగా సురక్షితమైన దీపావళిని జరుపుకోవాలని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు సూచించారు.


