NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హై సెక్యూరిటీ పత్రాల  కొరత..!

1 min read

మహానంది, న్యూస్​ నేడు:  మహానంది మండలంలో హై సెక్యూరిటీ పత్రాల కొరత గత రెండు రోజుల నుంచి ఏర్పడింది. దీంతో మండలంలోని వివిధ గ్రామాల్లో విద్యార్థినీ విద్యార్థులు, ఇతరులు పలు రకాల సర్టిఫికెట్లు పొందడానికి దరఖాస్తు చేసుకున్న వాటిని పొందడానికి హై సెక్యూరిటీ పత్రాలు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థిని విద్యార్థులు ప్రస్తుతం వివిధ కళాశాలల్లో చేరడానికి కుల, ఆదాయ, పుట్టిన తేదీల్లో మార్పులు చేర్పులు, ఈ డబ్ల్యూ ఎస్ స్కీములకు సంబంధించి సర్టిఫికెట్లు పొందాలంటే హై సెక్యూరిటీ పత్రాలు అవసరమవుతాయి. ఇవి పంచాయతీ కార్యాలయాల్లో అందుబాటులోలేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నట్లు సమాచారం. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో మహానంది మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తుంది. హై సెక్యూరిటీ పత్రాలను మండలంలోని  ఎంపీడీవో కార్యాలయంలో నిలువ ఉంచి అక్కడినుండి మండలంలోని వివిధ గ్రామపంచాయతీ కార్యాలయాలకు తరలించి సర్టిఫికెట్ల మంజూరు కొరకు వీటిని వినియోగిస్తారు. కానీ మహానంది మండల ఎంపీడీవో కార్యాలయంలో హై సెక్యూరిటీ పత్రాలు నిల్వ లేకపోవడంతో పంచాయతీ కార్యాలయంలో కూడా ఖాళీ అయినట్లు తెలుస్తుంది. అధికారుల నిర్లక్ష్య కారణంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తుంది. ప్రైవేటు మీసేవ కేంద్రాల్లో హై సెక్యూరిటీ పత్రాలు నిలువ ఉన్నప్పుడు మండల కేంద్ర కార్యాలయంలో నిల్వలు లేకపోవడం , వివిధ గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సరిపడ హై సెక్యూరిటీ  పత్రాల నిల్వలు ఉన్నాయా లేదా అని కనీస సమాచారం కూడా మండల కార్యాలయంలో లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హై సెక్యూరిటీ పత్రాలు గ్రామపంచాయతీ కార్యాలయాలకు అందజేసి సర్టిఫికెట్లు అందజేసే విషయంలో విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాలకు సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులు వెళ్లినప్పుడు హై సెక్యూరిటీ పత్రాలు లేవని అవి వస్తే ఇస్తామని సమాధానం చెబుతున్నట్లు దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. ఆ పత్రాలు ఎప్పుడు వస్తాయి, దరఖాస్తుదారులకు ఎప్పుడు అందజేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. వదిలిపెట్టమంటే పాము కు కోపం కరవమంటే కప్ప (మాండుకం ) కు కోపం అన్న చందనంగా పాపం గ్రామపంచాయతీ కార్యాలయ సిబ్బంది పై అధికారులను అడగలేక దరఖాస్తుదారులకు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది.

About Author