తల్లిపాలతోనే ఆరోగ్యం
1 min read

బిడ్డ మేధస్సు, ఎదుగుదలలో ‘ ముర్రుపాల’ పాత్ర కీలకం
- ఎం. భువనేశ్వరి, సీనియర్ పీడియాట్రిక్, జి.వి.ఆర్ హాస్పిటల్ ఎం.డి., ఎన్ ఆర్ పేట, కర్నూలు
- అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు:తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, ఎన్నో పోషకాలు ఉన్న ఈ పాలు పసిపిల్లల్ని చాలా ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడంలో తోడ్పడతాయన్నారు సీనియర్ పీడియాట్రిక్, జి.వి.ఆర్. హాస్పిటల్ ఎం.డి. డా. భువనేశ్వరి. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం ఆమె హాస్పిటల్ లో విలేకరులతో మాట్లాడారు. పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రుపాలు తాగించాలని చెప్పినా.. కొందరు తల్లులు ఏదో కారణం చెబుతూ ఇవ్వడంలేదని, దీని వల్ల బిడ్డ మేధస్సుకు, ఎదుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పుట్టిన బిడ్డ తీసుకున్న ఆహారం తేలిగ్గా, సులభంగా జీర్ణం కావడానికి తల్లిపాలే సరైనవని, తల్లిపాల ద్వారానే బిడ్డకు కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్లు, మిటమిన్లు, మినరల్స్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం అందుతాయన్నారు. అంతేకాదు.. వాటిలో ఎలాంటి హానికరమైన సూక్ష్మక్రిములు ఉండవు. కాబట్టి వీటిని తీసుకున్న పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు.
తల్లీకి మంచిదే..
తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డతో పాటు తల్లికి అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. గర్భస్థ సమయంలో పెరిగిన బరువు తగ్గడం, రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండడంతో పాటు అనేక రకాల ప్రయోజనాలకు కూడా తల్లి పొందుతుంది. బిడ్డకు ఆరు నెలల వయసొచ్చే వరకు తల్లిపాలే సంపూర్ణ ఆహారం. ఆరు నెలలు దాటిన తర్వాత చాలామంది పిల్లలకు ఘనాహారం ఇవ్వటం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో తల్లిపాలు ఇవ్వడం ఆపేస్తుంటారు. దీని ఫలితంగా పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆరు నెలలు దాటిన తర్వాత కూడా పిల్లలకు ఘనాహారంతో పాటు మధ్యమధ్యలో తల్లిపాలు కూడా ఇవ్వడం మంచిది. కనీసం సంవత్సరం వరకైనా వీటిని కొనసాగించడం బిడ్డకే కాదు తల్లికి కూడా ఎంతో శ్రేయస్కరమని జి.వి.ఆర్ హాస్పిటల్ ఎం.డి., సీనియర్ పీడియాట్రిక్ డా. ఎం. భువనేశ్వరి వెల్లడించారు.

