ఆరాధన మహోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు
1 min read

ఆగస్టు 8 నుండి 14 వరకు సప్తరాత్రోత్సవాలు
10 న పూర్వరాధన, 11 న మధ్యారాధన, 12 న ఉత్తరరాధన
పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు
మంత్రాలయం , న్యూస్ నేడు: మంత్రాలయం పవిత్ర తుంగభద్ర నది ఒడ్డున జీవసమాధి అయిన కలియుగ కల్పతరువు, కలియుగ దైవం, కోరిన వారి కోర్కెలు తీర్చే కామదేనువు శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధనోత్సవాలు శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో జరుగుతాయని శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు తెలిపారు. సోమవారం శ్రీమఠం గురునివాస్ భవనం లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు మాట్లాడుతూ ఆగస్టు 8 నుండి 14వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయని తెలిపారు. ఆరాధనోత్సవాలలో భాగంగా ముఖ్య దినాలు 10 న పూర్వరాధన, 11 న మధ్యారాధన, 12 న ఉత్తరరాధన మహ రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇందు కోసం శ్రీ మఠం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. ఆరాధనోత్సవాల సందర్భంగా తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో ప్రావీణ్యం ఉన్న పండితులచే శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మహిమలు, గ్రంథాల గురించి ప్రవచనాలు నిర్వహించబడతాయని తెలిపారు. అంతేకాకుండా, ప్రసిద్ధ కళాకారులచే వివిధ సంగీత, నృత్య, వాద్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. శ్రీ మఠం ప్రాంగణంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారు రచించిన గ్రంథాల పారాయణం, భజన బృందాలతో సామూహిక భజన కార్యక్రమాలు, గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులకు అవార్డుల ప్రదానం కార్యక్రమ ఉంటుందని తెలిపారు. టిటిడి పట్టువస్త్రాలు సమర్పణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.
ప్రధాన ఘట్టాలు మరియ పురస్కారాలు
ఆగస్టు 8, 2017న ఉత్సవాల తొలి రోజున ద్వజారోహణం కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే శ్రీ శ్రీనివాసని శేష వస్త్రం శ్రీ రాఘవేంద్ర స్వామికి సమర్పించబడుతుంది. రెండవ రోజు కూరగాయలతో షాకోత్సవం, మూడవ రోజు ఆగస్టు 10, 2025న పూర్వారాధన దినమున వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన సాధకులకు శ్రీమఠం అత్యున్నత పురస్కారాలైన శ్రీ రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్థి మరియు గురు అనుగ్రహ ప్రశస్థి అవార్డులను ప్రదానం చేస్తారు. ఇక ఆగస్టు 12, 2025న ఉత్తరారాధన రోజున ఉదయం 10 గంటలకు శ్రీ రాఘవేంద్ర స్వామి మహా రథోత్సవం అంగరంగ వైభవంగా మంత్రాలయం పురవీధులలో నిర్వహించబడుతుంది. రథం మీద పూల వర్షం కురిపించేందుకు హెలికాప్టర్‌ను కూడా ఉపయోగిస్తారు. ఈ రథోత్సవాన్ని వీక్షించడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు.
భక్తుల సౌకర్యార్థం నూతన ఏర్పాట్లు
ఆరాధన ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అనేక నూతన కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇటీవల నిర్మించిన నూతన పుష్కరిణి, సాధారణ భక్తుల కోసం నిర్మించిన డార్మెటరీ హాలు, లాకర్ సదుపాయం ప్రారంభించబడతాయి. గర్భాలయం శిలాస్తంభాలకు మరియు శిలా మండపం యొక్క దక్షిణ భాగంకు సువర్ణ లేపిత కవచాల అమరికను కూడా ప్రారంభిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నూతనంగా క్యూ కాంప్లెక్స్, వేచి ఉండే కంపార్ట్మెంట్లు, ఉపరితల వంతెన వంటి సౌకర్యాలు కల్పించారు.
విస్తృత భద్రతా ఏర్పాట్లు
ఆరాధన మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు శ్రీ మఠం అధికారులు తెలిపారు. తుంగభద్రా నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు వీలుగా నది తీరంలో షవర్లను ఏర్పాటు చేశారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా అదనపు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తగినంత పరిమళ ప్రసాదం మరియు భోజన ప్రసాదం నిల్వలు సిద్ధం చేశారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, స్వయంసేవకుల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.మంత్రాలయంలో ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని, కార్ పార్కింగ్ కోసం బస్టాండ్ ఎదురుగా ఉన్న రెండెకరాల స్థలంతో పాటు, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రాంతం, హిలిపాడు గ్రౌండ్ ప్రాంతం, మరియు నాగలదిన్నె రోడ్డులో కూడా ఏర్పాట్లు చేశారు. శ్రీ మఠం ఆధ్వర్యంలో ఇప్పటికే ఉన్న పార్కింగ్ స్థలం కూడా భక్తులకు అందుబాటులో ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం అదనంగా సేవా బుకింగ్ కౌంటర్లు మరియు పరిమళ ప్రసాద వితరణ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామని మఠం మేనేజర్ ఎస్.కె. శ్రీనివాస రావు తెలిపారు. భక్తులందరూ ఈ ఆరాధనోత్సవాలలో పాల్గొని శ్రీ రాఘవేంద్ర స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభూదేంద్ర తీర్థ స్వామీజీ స్వయంగా మీడియా ముఖంగా తెలియజేశారు.



