అవయవ దానం చేసి ముగ్గురికి కొత్త జీవితం…
1 min read

నంద్యాల జిల్లా, కోయిలకుంట్ల మండలంలోని పెద్దకొప్పెర్ల గ్రామానికి చెందిన 39 ఏళ్ల టి. శివరామ సుబ్బయ్య అవయవ దానం చేసి ముగ్గురికి కొత్త జీవితం ఇచ్చారు
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా, కోయిలకుంట్ల మండలంలోని పెద్దకొప్పెర్ల గ్రామానికి చెందిన 39 ఏళ్ల టి. శివరామ సుబ్బయ్య , భార్య రామసుబమ్మ, ఇద్దరు పిల్లలతో ఉంటున్నారు. ఆగస్టు 10న స్నేహితులతో కలిసి దగ్గర్లోని నదికి చేపలు పట్టడానికి వెళ్లారు. అక్కడ జారి పడటంతో తలకు పెద్ద రాయికి బలంగా తగిలి తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిస్థితి బాగోలేదని చెప్పి కర్నూలుకు పంపించారు. అదే రోజు ఓమ్ని హాస్పిటల్‌లో చేర్చి వెంటిలేటర్‌పై ఉంచారు. మంచి చికిత్స కోసం పెద్ద హాస్పిటల్‌కి పంపమని సూచించడంతో, ఆగస్టు 11న మెడికవర్ హాస్పిటల్‌కి తీసుకువచ్చారు. కానీ ఆగస్టు 12న వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.ఆసుపత్రి వాళ్లు జీవన్‌దాన్ అవయవ దానం గురించి కుటుంబానికి చెప్పగా, భార్య రామసుబమ్మ , కుటుంబసభ్యులు ధైర్యంగా అంగీకరించారు. తండ్రి పేరు ఎప్పటికీ నిలవాలన్న భావంతో ఆయన అవయవాలను దానం చేశారు. పోస్ట్‌గ్రాడ్ మెడికల్ డీన్ డాక్టర్ సాయి సుధీర్ (HOD ఫోరెన్సిక్ – GGH) నేతృత్వంలో డా. అబ్దుల్ సమద్, డా. సిద్ధార్థ, డా. బి. ప్రవీణ్, డా. శరత్ తదితరులు అవయవాలను సేకరించారు. ఈ “గ్రీన్ డోనర్” కుటుంబాన్ని వైద్యులు సత్కరించారు.
సేకరించిన అవయవాలు ఇలా పంపించారు:
1. ఒక కిడ్నీ – నెల్లూరు అపోలో హాస్పిటల్‌కి
2. మరో కిడ్నీ – కర్నూలు మెడికవర్ హాస్పిటల్‌లో మార్పిడి
3. కాలేయం – కర్నూలు కిమ్స్ హాస్పిటల్‌కి
మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ మహేశ్వర్ రెడ్డి చెప్పారు – “అవయవ దానం అనేది ప్రాణానికి ఇచ్చే గొప్ప బహుమతి. సుబ్బయ్య పేరు ఆయన కాపాడిన ప్రాణాల్లో ఎప్పటికీ నిలుస్తుంది” అని.డాక్టర్లు, సిబ్బంది ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి, ఆయన తీసుకున్న ఈ నిర్ణయం మరెందరికో జీవం ఇచ్చిందని తెలిపారు.

