సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేద్దాం..
1 min read

జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : సమిష్టి కృషితో జిల్లాను అభివృద్ధి చేద్దాం అని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి జిల్లా అధికారులతో పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు కలెక్టర్ గా ఫస్ట్ పోస్టింగ్ అని తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అధికారులందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు…కలెక్టర్ లుగా నియమితులైన వారందరితో ముఖ్యమంత్రి మాట్లాడారని, జిల్లాలను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చి దిద్దాలని ఆదేశించారన్నారు. ఆ మేరకు ప్రభుత్వ ప్రాధాన్యతలపై ప్రత్యేక దృష్టి సారించి, అధికారులు పనిచేయాలని సూచించారు.. ప్రజలకు మేలు జరిగే విధంగా, సంక్షేమాన్ని అందించే విధంగా,అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు కేసులు, ఆర్టీఐ అంశాల్లో అలసత్వం వహించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు..పనుల్లో వేగం ముఖ్యం అని కలెక్టర్ స్పష్టం చేశారు. వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరం అని, ప్రజల సంక్షేమం కోసం సమష్టిగా పని చేద్దామన్నారు. సానుకూల దృక్పథంతో, సంతోషకర వాతావరణంలో, స్మార్ట్ గా పని చేద్దామని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా అధికారులు పరిచయం చేసుకుని, పుష్పగుచ్ఛాలు అందించి కలెక్టర్ కు అభినందనలు తెలిపారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, డి ఆర్ ఓ సి. వెంకట నారాయణమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


