టెట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం
1 min read

సచివాలయంలో మంత్రి నారా లోకేష్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్సీలు
ఉపాధ్యాయుల ఆవేదనను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్సీలు
సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ
అమరావతి, న్యూస్ నేడు : టెట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ సచివాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. 23-10-2010 కి ముందు డీఎస్సీల ద్వారా ఎంపికైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటీషన్ వేయాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం 01-09-25 నాటికి రిటైర్మెంట్ కు 5 ఏళ్లు పైబడి సర్వీస్ కలిగిన టెట్ పాస్ కాని ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాలని ఉత్తర్వులు జారీ చేసింది.దీనిపై మంత్రి స్పందిస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ నిర్వహిస్తామని తెలియజేస్తూనే ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు.

