NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ సేవాపథకం స్ఫూర్తితో వాలంటీర్లు సమాజసేవలో భాగస్వాములు కావాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జాతీయ సేవాపథకం స్ఫూర్తితో వాలంటీర్లు సమాజసేవలో భాగస్వాములు కావాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. యూనివర్సటీ ఇంజినీరింగ్ కాలేజీకి సంబంధించిన ఎన్​ఎస్​ఎస్​ 4 మరియు 5వ యూనిట్ల ఆధ్వర్యంలో పి. రుద్రవరం, నూతనపల్లె గ్రామాల్లో నేటినుండి 23వ తేదీవరకు నిర్వహించనున్న స్పెషల్ క్యాంపులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యువత బాధ్యతాయుతంగా ఉన్నపుడే మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని ఆయన హితవు పలికారు. వారంరోజులపాటు గ్రామీణులతో మమేకమై వారి స్థితిగతులను తెలుసుకోవడంతోపాటు, సామాజిక రుగ్మతలపై వారిలో చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేయవలసినదిగా ఆచార్య బసవరావు పిలుపునిచ్చారు. జాతీయ సేవాపథకం తరపున స్పెషల్ క్యాంపులకు రూపకల్పన చేసిన ఇంజినీరింగ్ కాలేజి ఎన్​ఎస్​ఎస్​ యూనిట్ల ప్రోగ్రాంఆఫీసర్లు డాక్టర్ నాగచంద్రుడు, బి.వి. శివప్రసాదరెడ్డిలను వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయకుమార్ నాయుడు అభినందించారు. జాతీయ సేవాపథకంలో భాగస్వాములైన ప్రతి ఒక్క వాలంటీరు స్పెషల్ క్యాంపులో పాల్గొనడంద్వారా తగిన వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవచ్చని వర్సిటీ  ఎన్​ఎస్​ఎస్​ సమన్వయకర్త డాక్టర్ పి. నాగరాజు వివరించారు. దేశ సమగ్రత, స్వాతంత్ర్యాలను కాపాడటంతోపాటు, దేశ పురోభివృద్ధికి త్రికరణశుద్ధిగా కృషిచేస్తానని జాతీయ సేవాపథక వాలంటీర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమాల్లో వర్సిటీ అధికారులతోపాటు పి. రుద్రవరం గ్రామ సర్పంచ్ కె. మధు, నూతనపల్లెలో పంచాయితీ సెక్రటరీ హేమంత్, స్థానిక పాఠశాల హెడ్ మాస్టర్ రఘు పాల్గొన్నారు. స్పెషల్ క్యాంపు తొలిరోజు కార్యక్రమాల్లో భాగంగా పి. రుద్రవరంలో ఎన్​ఎస్​ఎస్​  వాలంటీర్లు మధ్యలో బడిమానేసిన పిల్లలు, గ్రామీణప్రాంత సమస్యల గురించిన సర్వేనిర్వహించారు. అలాగే నూతనపల్లెలో ఎయిడ్స్ వ్యాధిపట్ల అవగాహనా ర్యాలీ నిర్వహించారు.

About Author