NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విశ్వ మానవ ధార్మిక జీవన ప్రబోధిని-రామాయణం

1 min read

డాక్టర్ తొగట సురేశ్ బాబు

గోసానిపల్లెలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు:  “ప్రపంచంలో కులాలకు, మతాలకు, జాతులకు, దేశాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఆచరించదగిన ధార్మిక జీవనాన్ని ప్రబోధించే మహత్తర గ్రంథం శ్రీమద్రామాయణమని, ధర్మానికి నిలువెత్తు రూపంగా భాసించే శ్రీరాముని ఆదర్శవంతమైన వ్యక్తిత్వం అందరికీ అనుసరణీయమ”ని ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ తొగట సురేశ్ బాబు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు – హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా, డోన్ మండలం, గోసాని పల్లె గ్రామంలో వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంనందు ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 23వ తేదీ రామాయణం విశిష్టతపై ధార్మికోపన్యాసకులు డాక్టర్ తొగట సురేశ్ బాబు ప్రసంగిస్తూ “భారతదేశం కర్మభూమి. మానవులందరూ తాము నిర్వర్తించే కర్మానుసారం ఫలితాలను పొందుతారని,  భగవంతుడు ఈ భారత దేశంలోనే దుష్ట శిక్షణకై, శిష్ట రక్షణకై, సన్మార్గ ప్రబోధానికై, మానవీయ ధార్మిక, నైతిక విలువల పరిరక్షణకై అవతరిస్తూ ఉంటాడని, మిత్రునిగా, గురువుగా, బంధువుగా ఇలా అనేక రూపాల్లో మనకు జ్ఞాన ధారను కురిపిస్తుంటాడని,  సనాతన హైందవ సంస్కృతీ సంప్రదాయాల దీపికలుగా రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలు శోభిస్తున్నాయని,  పురాణాలు, కావ్యాలు, ఈ గ్రంథాలలోని సారాంశాన్ని మనకు సరళంగా ప్రబోధిస్తున్నాయని,  అందుకే లౌకికపరమైన జీవితాన్ని గడపటానికి, ధనసముపార్జనకు మనం చేసే మామూలు విద్యాభ్యాసము, పదార్థ జ్ఞానము ఎంత గొప్పదో, ఆధ్యాత్మిక పారమార్థిక జ్ఞానం కూడా అంతే గొప్పదని, మానవుడు ప్రశాంత జీవనం గడపడానికి,అసూయా ద్వేషాలు లేని సమ సమాజం రూపొందటానికి  ఈ  ఆధ్యాత్మిక జ్ఞాన సాధన ఎంతో ఉపకరిస్తుందని,  రామాయణ ఇతిహాసం ప్రపంచంలోనే ఆదికావ్యమని మానవాళికి నైతిక విలువలు ధార్మిక జీవనం గురించి తెలియచేయడానికి మహర్షి వాల్మీకి కలం నుంచి జాలువారిన అద్భుత గ్రంథం రామాయణమని పితృ వాక్య పరిపాలన, మాతృభక్తి, స్నేహం విలువ, అన్నదమ్ముల మధ్య ఉండవలసినటువంటి వాత్సల్య భరితమైన అభిమానము భార్యా భర్తల మధ్య ఉండవలసిన అనురాగము, దుర్మార్గ వర్తనం కలిగిన వారికి కలిగే వినాశకర ఫలితాలు ధర్మ కార్య నిర్వహణలో మనం బద్ధులమైతే మన కలిగే శుభ ఫలితాలు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి కార్యసాధకునికి ఉండవలసిన లక్షణాలు ఇలాంటి వివరాలన్నింటినీ ప్రబోధించే రామాయణ విశిష్టత గురించి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమాల అనంతరం గ్రామస్తులు స్థానిక  భజన బృందంచే భజన కార్యక్రమం కొనసాగించారు.  కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా మూడు రోజులపాటు ఉపన్యాసాలు మరియు భజన కార్యక్రమాలు, శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలతోపాటు శనివారం భజన కార్యక్రమంతో ముగుస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాధవస్వామి, సత్సంగ ప్రముఖ్ బండారు రామకృష్ణ, సూర్యనారాయణ, రామాంజనేయులు, శ్రీనివాసులు, రంగయ్య, మధు, గంగన్న, శ్రీరాములుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author