NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పారదర్శకంగా అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టండి

1 min read

ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడినా బాధ్యులపై కఠిన చర్యలు

కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలకు వర్క్ ఫోర్స్ సిద్ధంచేయాలి

ఐటిఐలను పరిశ్రమలతో అనుసంధానించి స్కిల్ గ్యాప్ భర్తీచేయండి

ఉన్నత విద్య, స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష

అమరావతి, న్యూస్​ నేడు: రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో ఫ్యాకల్టీ భర్తీ ప్రక్రియలో విశ్వవిద్యాలయాలు, వైస్ చాన్సలర్లు అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్ మెంట్ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి, భర్తీ ప్రక్రియలో ఎటువంటి ఉల్లంఘనలు, ఆరోపణలు తలెత్తినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల పరిధిలో అధ్యాపక పోస్టుల కోసం 1,90,509 అప్లికేషన్లు రాగా, వాటిలో 1,51,836 దరఖాస్తులు అర్హమైనవిగా నిర్థారించినట్లు అధికారులు తెలిపారు. ఎలిజిబిలిటీకి సంబంధించి గ్రీవెన్స్ ను ఈనెల 21వతేదీ వరకు స్వీకరించి, 27వతేదీన అర్హుల తుదిజాబితా విడుదల చేస్తామని తెలిపారు. ఇంటర్వ్యూ ప్రక్రియను సైతం పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా చూడాలి, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రైవేటు యూనివర్సిటీల అనుమతులకు సంబంధించి విధివిధానాలు, వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సెట్ల నిర్వహణ పురోగతిపై చర్చిస్తూ… సకాలంలో  అడ్మిషన్లు పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రైవేటు వర్సిటీలకు అనుమతులు ఇచ్చే సమయంలో యుజిసి నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టంచేశారు.

జాబ్ మేళాల ద్వారా 1.37లక్షలమందికి ఉద్యోగాలు

స్కిల్ డెవలప్ మెంట్ శాఖపై మంత్రి సమీక్షిస్తూ… రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1.37లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయని తెలిపారు. యువతకు మరింత సౌలభ్యంగా ఉండేలా జాబ్ మేళాలను నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి ఐటిఐని పరిశ్రమలకు అనుసంధానించి, యువత నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన వర్క్ ఫోర్స్ తయారు, స్కిల్ గ్యాప్ భర్తీపై నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించి 81 ఆపరేషనలైజ్ ఇండస్ట్రీ అకడమిషియా పార్టనర్ షిప్స్‌ను సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాకేంద్రాల్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ ఆధ్వర్యాన రూ.94కోట్లతో ట్రైనింగ్ సెంటర్ల నిర్మాణానికి డిజైన్లు సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. నైపుణ్యం పోర్టల్ ను యువతకు ఉపయోగకరంగా తీర్చిదిద్ది, వచ్చేనెలలో ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు ఎన్ రోల్ మెంట్ ఆధారంగా మొదటి సంవత్సరం నుంచే వివిధ ఉద్యోగాలు, వాటికి కావాల్సిన స్కిల్స్ సమాచారం, కెరీర్ గైడెన్స్ వివరాలతో నైపుణ్యం పోర్టల్ ద్వారా అప్ డేట్స్ వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి విద్యార్థికి స్కిల్స్ పై అవగాహన కల్పించడమేగాక ఆన్ లైన్ లో స్కిల్ పాస్ పోర్టు అందిస్తామని తెలిపారు. కళాశాల నుంచి చదువు పూర్తిచేసుకుని బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ప్లేస్ మెంట్ లభించేలా విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి చర్యలు చేపట్టాలి. రాష్ట్రంలో 169 ప్రభుత్వ డిగ్రీ కశాళాలల్లో ప్లేస్ మెంట్ సెల్స్ ఏర్పాటుచేయాలని సూచించారు. ఫలితాల సాధనే అంతిమ లక్ష్యంగా అధికారులు పనిచేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, స్కిల్ డెవలప్ మెంట్ సిఇఓ గణేష్ కుమార్, సీడాప్ సిఇఓ నారాయణస్వామి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. విజయభాస్కర్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *