29న కలెక్టరేట్ ఆవరణలో పెద్దఎత్తున రెవెన్యూ క్లినిక్స్
1 min read

రెవెన్యూ సమస్యలకు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా వేగవంత పరిష్కారం
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు ఈ నెల 29వ తేదీ సోమవారం రోజున కలెక్టరేట్ ఆవరణలో జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో ఏడు రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేసి, ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించి నమోదు చేయడంతో పాటు, సమస్యల స్వరూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు హాజరై ప్రజలకు సేవలు అందిస్తారని పేర్కొన్నారు.రెవెన్యూ, అడంగల్ సవరణలు, 22ఎ–చుక్కల భూముల క్రమబద్ధీకరణ, అసైన్డ్ భూములు–భూ ఆక్రమణలు, రెవెన్యూ కోర్టు కేసులు, సర్వే–రీ సర్వే, దేవాదాయ–వక్ఫ్ భూముల సమస్యలకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజల అర్జీలకు వేగవంతమైన పరిష్కారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఆ ప్రకటనలో కోరారు.

