షరాఫ్ బజార్లోని 196 దుకాణాలకు క్లోజర్ నోటిసులు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: శనివారం నగరపాలక సంస్థకు రావాల్సిన ట్రేడ్ లైసెన్స్ బకాయిల వసూళ్లను నగరపాలక సిబ్బంది వేగవంతం చేశారు. బకాయిలు చెల్లించని వ్యాపారులపై సిబ్బంది కఠిన చర్యలు చేపడుతున్నారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించని దుకాణదారులపై నిబంధనల ప్రకారం చర్యలు కొనసాగుతున్నట్లు సిబ్బంది తెలిపారు.ఈ క్రమంలో శనివారం షరాఫ్ బజార్ పరిధిలో సుమారు రూ.15 లక్షల ట్రేడ్ లైసెన్స్ బకాయిలు చెల్లించని 196 దుకాణాలకు క్లోజర్ నోటీసులు జారీ చేశారు. అలాగే క్లోజర్ నోటీసులు జారీ చేసినప్పటికీ బకాయిలు చెల్లించకుండా వ్యాపారాలు కొనసాగిస్తున్న మూడు షాపులను సీజ్ చేశారు. మున్సిపల్ నిబంధనలను అతిక్రమిస్తూ వ్యాపారాలు నిర్వహించడం చట్ట విరుద్ధమని, బకాయిలు చెల్లించని పక్షంలో మరింత కఠిన చర్యలు తప్పవని ప్రజారోగ్య సిబ్బంది హెచ్చరించారు. ట్రేడ్ లైసెన్స్ బకాయిలు చెల్లించడం ప్రతి వ్యాపారి బాధ్యత అని పేర్కొంటూ, వెంటనే బకాయిలు చెల్లించి సహకరించాలని నగరపాలక సిబ్బంది వ్యాపారులను కోరారు. నగర అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణతో పాటు ప్రజా సౌకర్యాల నిర్వహణకు ఈ వసూళ్లు ఎంతో కీలకమని వివరించారు.ఈ తనిఖీల్లో శానిటేషన్ ఇంస్పెక్టర్ రమేష్ బాబు, ఆర్.రాజు, మునిస్వామి, అనిల్ కుమార్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

