క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి
1 min read
వ్యాధిపై అవగాహన పెంచుకోండి
- ఓమేగా హాస్పిటల్ మెడికల్ ఆంకాలజిస్టు డా.సుదీర్ రెడ్డి
- అవగాహన ర్యాలీని ప్రారంభించిన డిఐజి విక్రాంత్ పాటిల్
కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు: సమాజంలో క్యాన్సర్ కేసులు అధికమవుతున్నాయని, వ్యాధిపై అవగాహన పెంచుకొని.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే నియంత్రించవచ్చని ఓమేగా హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ ఆంకాలజిస్టు డా. సుధీర్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నగరంలోని ఓమేగా హాస్పిటల్ నుంచి నంద్యాల చెక్ పోస్టు వరకు మెడికల్ విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంతకు ముందు నగరంలోని ఓమేగా హాస్పిటల్ దగ్గర క్యాన్సర్ పై అవగాహన ర్యాలీని డిఐజి, కర్నూలు ఇన్చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంకాలజిస్టులు డా. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధులపై ప్రజల్లో చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. క్యాన్సర్‌పై భయం కాకుండా జాగ్రత్త అవసరమని, ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, వ్యాయామం ద్వారా ఈ వ్యాధి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. అనంతరం ప్రముఖ ఆంకాలజిస్టు డా. భవాని మాట్లాడుతూ మహిళలు రొమ్ము క్యాన్సర్ , గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు క్యాన్సర్ పై అవగాహన లేక… చెప్పుకోడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని, అలా కాకుండా ప్రతి ఒక్కరూ క్యాన్సర్ బాధితులకు మనోధైర్యమిచ్చి… చికిత్సకు సహకరించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ సీఈఓ రవి కిరణ్, మెడికల్ డైరెక్టర్ వై. వెంకట రామిరెడ్డి, చీఫ్ రేడియాలజిస్టు వై. ఆదిత్య , సిబ్బంది తదితరులు ఉన్నారు.



