రాఘవేంద్రుడి సన్నిధిలో.. కేంద్ర మంత్రి..
1 min read

ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు
- శ్రీ గురు వైభవోత్సవాలకు ఆహ్వానించిన పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థ స్వామిజీ
మంత్రాలయం, న్యూస్ నేడు :ప్రఖ్యాత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో కొలువై ఉన్న శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనాన్ని కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ రంగ సంస్థల శాఖా మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. శ్రీ మఠంలో నిర్వహిస్తున్న శ్రీ గురు వైభవోత్సవాలు కార్యక్రమాలకు హాజరు కావాలని పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థ స్వామిజీ వారు అందించిన ఆహ్వానం మేరకు వారు మంత్రాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీ మఠం ఆధ్వర్యంలో నడుస్తున్న అతిథి గృహానికి చేరుకున్నారు. అనంతరం ఆలయానికి చేరుకున్న ప్రముఖులను శ్రీ మఠం ఏఏఓ మాధవ శెట్టి, మేనేజర్లు ఎస్.కే. శ్రీనివాసరావు, వెంకటేష్ జ్యోషి, సురేష్ కోనాపూర్, ఆధ్యాత్మిక అభివృద్ధి అధికారి శ్రీ పతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐ.పి. నరసింహమూర్తి తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఈ సందర్భంగా వారు గ్రామదేవత శ్రీ మంచాలమ్మ అమ్మవారిని దర్శించుకొని, అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు స్వీకరించారు. అలాగే శ్రీ మఠంలో నిర్వహించిన వివిధ పూజా కార్యక్రమాలు, రథోత్సవంలో పాల్గొని భక్తులతో కలసి ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పంచుకున్నారు. అనంతరం శ్రీ మఠం ఆవరణంలోని యోగీంద్ర సభామండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి మాట్లాడుతూ… శ్రీ రాఘవేంద్రస్వామి మహిమలను, మఠం చేపడుతున్న ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలను కొనియాడారు. పీఠాధిపతుల సేవాభావాన్ని ప్రశంసిస్తూ, సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడంలో శ్రీ మఠం కీలక పాత్ర పోషిస్తున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థ స్వామిజీ వారు కేంద్ర మంత్రి శ్రీ హెచ్.డి. కుమారస్వామి గారు, మాజీ క్రికెటర్ శ్రీ వెంకటేష్ ప్రసాద్ గారు సహా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను శేషవస్త్రం, ఫలమంత్రాక్షతలతో సత్కరించి రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కౌశిక్ ఆచార్, ద్వారపాలక అనంతస్వామి, రాఘవేంద్రరావు, సబ్ కలెక్టర్ (ఇంచార్జి) అజయ్ కుమార్, డి.ఎస్.పి. భార్గవి, తహసీల్దార్ రమాదేవి, శ్రీ మఠం సిబ్బంది, అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


