సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ
1 min read

సేవల మెరుగుదలకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు
పాణ్యం/నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవల నాణ్యతను మరింత మెరుగు పరచాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం పాణ్యం మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కార్యాలయంలో అందిస్తున్న సేవలు, ప్రజలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, సేవల అందించే సమయం, ప్రజల సంతృప్తి స్థాయి వంటి అంశాలపై కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. సేవలలో పారదర్శకత, వేగం, ప్రజలకు సులభతరం కావడం వంటి అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.తనిఖీ సమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్లు జిల్లా కలెక్టర్ ని గమనించగానే తమ దుకాణాలను వదిలి వెళ్లిపోవడం గమనించిన ఆమె, దీనిని తీవ్రంగా పరిగణించారు. అనుమతులు, నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నట్లు అనుమానాస్పదంగా ఉన్న సంబంధిత దుకాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైన చట్టపరమైన చర్యలలో భాగంగా ఆయా దుకాణాలను సీజ్ చేయించాలని సూచించారు.ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలలో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి కార్యకలాపాలు జరగకూడదని, ప్రజలను తప్పుదారి పట్టించే చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావు ఉండదని స్పష్టం చేశారు. ప్రతి శాఖలోనూ పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం తప్పనిసరిగా ఉండాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అధికారులు పని చేయాలని ఆమె సూచించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా, నిష్పక్షపాతంగా అందేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.

