పోషణ పక్షోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి
1 min read

జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు : పోషణ పక్షోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజల్లో ఆరోగ్యం, పోషణపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పోషణ పక్షోత్సవాలకు సంబంధించిన గోడప్రచార పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లీలావతి దేవి, డిఆర్ఓ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 9 నుండి 23 వరకు పోషణ పక్షోత్సవాలను “క్యాంపెయిన్ మోడ్”లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ, డీఆర్‌డీఏ, మెప్మా (MEPMA), పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్ తదితర శాఖలు భాగస్వాములుగా పనిచేస్తున్నాయని చెప్పారు. సమాజంలో మారుతున్న తరాలైన జనరేషన్ జెడ్ (Gen Z), జనరేషన్ ఆల్ఫా (Gen Alpha), జనరేషన్ బీటా (Gen Beta) పిల్లల ఆరోగ్యం, పోషణ అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.అధిక స్క్రీన్ టైమ్ వల్ల కంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయని అన్నారు.అంతకుముందు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లీలావతి దేవి మాట్లాడుతూ, పిల్లలను ఆరోగ్యంగా పెంచేందుకు జంక్ ఫుడ్‌కు బదులుగా ఇంట్లో తయారుచేసిన పౌష్టికాహారం ఇవ్వాలని సూచించారు. అలాగే మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచి, కథలు చెప్పే పాత సంప్రదాయాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన పోస్టర్ల ద్వారా ఈ అవగాహనను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు.

