కార్మిక హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: 140వ అంతర్జాతీయ కార్మికవర్గ పోరాట దినం (మేడే) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ స్కూల్ వర్కర్స్ యూనియన్ (AIUTUC అనుబంధం) ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు (TMF), నైట్ వాచ్‌మెన్‌ల సమస్యలపై SSA AD శ్రీ కె. నాగభూషణంకి వినతి పత్రం సమర్పించారు. అనంతరం AIUTUC జిల్లా కార్యదర్శి ఎం. నాగన్న మేడే ప్రాముఖ్యతను వివరిస్తూ కార్మిక హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలోని దాదాపు 42 వేల పాఠశాలల్లో సుమారు 60 వేల మంది ఆయాలు, నైట్ వాచ్‌మెన్‌లు అనేక సంవత్సరాలుగా కేవలం రూ.6000 తక్కువ వేతనంతో పనిచేస్తూ, పాఠశాల గదులు, మరుగుదొడ్లు శుభ్రపరచడం, పరిసరాలను నిర్వహించడం వంటి కీలక పనులు నిర్వర్తిస్తున్నారు. అయినప్పటికీ వేసవి సెలవుల సమయంలో వారికి సగం వేతనం మాత్రమే చెల్లించడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. సెలవుల సమయంలో కూడా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ పూర్తి వేతనం ఇవ్వకపోవడం అన్యాయమని, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి పూర్తి వేతనాలు చెల్లిస్తుండగా వీరిపై వివక్ష చూపుతున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో ఆయాలు, నైట్ వాచ్‌మెన్‌లకు వేసవి సెలవుల్లో పూర్తి వేతనాలు చెల్లించడంతో పాటు నెలవారీ వేతనాన్ని రూ.15,000కు పెంచి, ప్రతి నెల 5వ తేదీలోపు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ద్వారా కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగరాజు, ఆసియా ఖాతూన్, అనంతమ్మ, సరిత తదితరులు పాల్గొన్నారు.

