గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000/- అమలు చేయాలి
1 min read
నెలల తరబడి పేరుకు పోయిన బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి
ఏపీ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా పంచాయతీ అధికారి(డిపిఓ) మల్లికార్జునరావు కు వినతి పత్రం
ఏపీ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి. కిషోర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏఐటీయూసీ నాయకత్వం డిపిఓ అని కలిసి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి. కిషోర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో 447 గ్రామ పంచాయతీల నందు, సుమారు రెండు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు.వీరంతా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, టెండర్ పద్ధతుల్లో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కంప్యూటర్ ఆపరేటర్లు, పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రిషన్లు, అటెండర్స్, ట్రాక్టర్ డ్రైవర్, పారిశుద్ధ్య కార్మికులు తదితర రూపాల్లో పని చేస్తున్నారని అన్నారు. ఈ కార్మికులకు ప్రతినెల సక్రమంగా జీతాలు అందడం లేదన్నారు. మేజర్ పంచాయితీ ల నందు సైతం కనీస వేతనం 26 వేల రూపాయలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఇస్తున్న కొద్దిపాటి జీతం 3 నెలల నుండి 7 నెలల వరకు ఆ,యా పంచాయతీల నందు బకాయిలు ఉన్నాయని అన్నారు. నెలల తరబడి పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల అప్పుల లతో కుటుంబాలు గడుపుకోవలసి వస్తుందని అప్పు కూడా పుట్టడం లేదన్నారు. పస్తులతో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం చెత్తాచెదారంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కొబ్బరినూనె, చెప్పులు, చేతి గ్లౌజులు వంటి కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. గ్రామపంచాయతీ కార్మికులందరికీ యూనిఫామ్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. కార్మికులందరికీ పిఎఫ్, ఇఎస్ఐ సౌకర్యాలు కల్పించాలన్నారు, ప్రతినెల 5వ తేదీ నాటికే జీతం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఇచ్చిన వినత పత్రంపై డిపిఓ స్పందిస్తూ మా పరిధిలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.

