జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం – అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
1 min read
మండల విద్యాధికారులు ఆర్. సుధారాణి, కె. కబీర్ సాబ్
హోళగుంద న్యూస్ నేడు: 2026–27 విద్యా సంవత్సరం జూన్ 12 (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక (PS), ప్రాథమికోన్నత (UPS), ఉన్నత పాఠశాలలు (HS) మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యా సంవత్సరం ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ఈ రోజే పూర్తి చేయాలని మండల విద్యాధికారులు (ఎంఈఓ-1) ఆర్. సుధారాణి, (ఎంఈఓ-2) కె. కబీర్ సాబ్ సూచించారు.పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్లు మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మధ్యాహ్న భోజన పథకం (MDM) నిర్వహణకు అవసరమైన వంట పాత్రలు, నిల్వ పాత్రలు తదితర సామగ్రిని శుభ్రపరచి సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అలాగే తరగతి గదులలోని స్మార్ట్ టీవీలు, IFA పరికరాలు, ఫర్నిచర్ మరియు ఇతర విద్యా సామగ్రిని వినియోగానికి సిద్ధం చేయాలని సూచించారు.తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు మరియు ఇతర మౌలిక వసతులు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ మరియు ఇతర విద్యా సామగ్రి అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.పాఠశాల ప్రారంభ దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని, కొత్తగా చేరిన విద్యార్థులకు పూర్వ విద్యార్థుల చేత ఘన స్వాగతం పలకాలని సూచించారు. కొత్త విద్యార్థుల్లో ఉన్న భయాందోళనలు తొలగించి, సహ విద్యార్థులతో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.అలాగే పాఠశాలకు వచ్చే తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం మరియు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించాలని సూచించారు.“బడికి వెల్దాం – బడిని అభివృద్ధి చేద్దాం” అనే లక్ష్యంతో ప్రతి విద్యార్థిని పాఠశాలకు ఆకర్షించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యా సంవత్సరం ప్రారంభాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని మండల విద్యాధికారులు ఆర్. సుధారాణి, కె. కబీర్ సాబ్ విజ్ఞప్తి చేశారు.


