అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను పటిష్టంగా నిర్వహించాలి
1 min read

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను ఎటువంటి లోపాలు లేకుండా భక్తిశ్రద్ధలతో, పటిష్టంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో బ్రహ్మోత్సవాల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ యుగంధర్ బాబు, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, ఆలయ పరిపాలనాధికారి రామానుజన్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 21వ తేదీన ప్రారంభమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 4వ తేదీ వరకు నిర్వహించబడుతున్నాయని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.దిగువ అహోబిలంలో లడ్డు కౌంటర్లను పెంచి భక్తుల రద్దీని తగ్గించాలని పేర్కొన్నారు. త్రాగునీరు మరియు ఇతర అవసరమైన వస్తువులు ఒకే ధరకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత తహశీల్దార్‌కు ఆదేశించారు. నీటి కుంటల వద్ద భద్రతా చర్యలుగా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, క్యూలైన్లలో ఉన్న భక్తులకు త్రాగునీరు, మజ్జిగ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

