సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు ప్రోటోకాల్‌కు అనుగుణంగా పకడ్బందీగా పూర్తి చేయాలి
1 min read
ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలి
హెలిప్యాడ్, తహసీల్దార్ కార్యాలయం, ప్రజా వేదికలను పరిశీలించిన రాష్ట్ర మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
బనగానపల్లె/నంద్యాల,న్యూస్ నేడు: ఈ నెల 9వ తేదీన బనగానపల్లెలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సునీల్ షోరాన్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ వీరి వెంట ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన హెలిప్యాడ్, తహసీల్దార్ కార్యాలయం, ప్రజా వేదికతో పాటు ఇతర కీలక ప్రాంతాలను సందర్శించి వివిధ శాఖల అధికారులు చేపట్టిన ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమంలో, ప్రతి శాఖ అధికారి తనకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఏర్పాట్లలో నాణ్యత, సమన్వయం, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. హెలిప్యాడ్ వద్ద భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, హెలికాప్టర్ ల్యాండింగ్, టేకాఫ్‌కు ఎటువంటి ఆటంకాలు లేకుండా పరిసర ప్రాంతాలను పూర్తిగా సిద్ధం చేయాలని ఆదేశించారు. హెలిప్యాడ్‌కు వెళ్లే రహదారులు, బ్యారికేడింగ్, భద్రతా వలయం, విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య ఏర్పాట్లు, అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.భద్రతా విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమం జరిగే నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండేలా ప్రతి శాఖ నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

