వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆలూరు ఎమ్మెల్యే
1 min read
ఆలూరు న్యూస్ నేడు: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా పులివెందుల సమీపంలోని ఇడుపులపాయలో నిర్వహించిన ఘన నివాళుల కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మర్యాదపూర్వకంగా కలిశారు.ముందుగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి జయంతి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు మహానేత ఆశయాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆలూరు నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ శ్రేణుల సమన్వయం తదితర అంశాలపై ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి విస్తృతంగా చర్చించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా మరింత సమర్థవంతంగా పనిచేయాలని అధినేత సూచించినట్లు తెలిపారు.అలాగే మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పాలన, రైతు సంక్షేమం, ఉచిత వైద్యం, విద్య, పేదల సంక్షేమం వంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల కోసం నిరంతరం సేవ చేయడమే నిజమైన నివాళి అని అన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులతో ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి కలిసి మహానేతకు నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను వివరించి, పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు స్వీకరించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆలూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులు అర్పించారు.

