వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఆలూరు ఎమ్మెల్యే
1 min read
హోళగుందన్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం సులువాయి గ్రామంలో శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ, వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా పశ్చిమ జిల్లాల్లో వాల్మీకి సమాజం ఇంకా పలు రంగాల్లో వెనుకబడి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.విద్య, సంస్కృతి, సామాజిక రంగాల్లో వాల్మీకులు అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా వాల్మీకి సమాజాన్ని ఎస్టీ జాబితాలో చేర్చడం అత్యవసరమని అన్నారు. ఇందుకోసం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రాజ్యాంగ సవరణ చేసి చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.పక్క రాష్ట్రం కర్ణాటకలో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల వారు విద్యా, రాజకీయ రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించారని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వాల్మీకి సమాజాన్ని ఎస్టీ జాబితాలో చేర్చి వారి సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై తాను కూడా తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు.ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గతంలో కర్నూలు పర్యటన సందర్భంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.చివరగా, వాల్మీకి మహర్షి ఆశీస్సులతో వాల్మీకి సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వాల్మీకి నాయకులు, ఎస్టీ సాధన కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు వాల్మీకి సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


