NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్యాపిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ….

1 min read

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.

జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ ఐపిఎస్.

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు పోలీసు యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ  సునీల్ షొరాణ్ ఐపిఎస్   పేర్కొన్నారు. ఈరోజు ఆయన ప్యాపిలి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల వివరాలు, పనితీరుపై స్వయంగా పరిశీలించడం జరిగింది. అనంతరం మండలంలోని నేరాల సరళిపై సిబ్బందితో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  విలేకరుల తో మాట్లాడుతూ మండలంలో ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, అయితే గత ఏడాది కాలంగా కొన్ని గ్రామాల్లో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయని మరియు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు.నాటుసారా తయారీ, విక్రయాల నియంత్రణలో మరియు జూదం  అరికట్టడంలో ప్యాపిలి పోలీసులు చూపిన చొరవను ఎస్పీ  అభినందించారు. తనిఖీల్లో భాగంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై అనగా అక్రమ మద్యం, నాటు సారాయి, జూదం, మట్కా మొదలగు వాటి నిర్మూలనకు తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఆన్‌లైన్ మట్కా, బెట్టింగ్ మరియు జూదం ఆడేవారికి ఎస్పీ  గట్టి హెచ్చరిక జారీ చేశారు. “ఆన్‌లైన్ వేదికగా ఆడుతున్నప్పటికీ, నిందితుల ఆర్థిక లావాదేవీల రికార్డులు మా వద్ద ఉంటాయి. అటువంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.

​ప్రజలకు విజ్ఞప్తి:

“పోలీస్ స్టేషన్ ప్రజలందరిది. ప్రజలకు ఎటువంటి వ్యక్తిగత లేదా సామాజిక సమస్యలు ఉన్నా నిస్సంకోచంగా పోలీస్ స్టేషన్‌ను గానీ, సర్కిల్ ఆఫీస్‌ను గానీ సంప్రదించవచ్చు. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే డీఎస్పీ లేదా నేరుగా నన్ను సంప్రదించవచ్చు. పోలీసులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటారు” అని ఆయన తెలిపారు.ముఖ్యంగా నాటుసారా విక్రయాలు, జూదం వంటి సామాజిక రుగ్మతలపై సమాచారం అందించి ప్యాపిలిని ఒక ప్రశాంతమైన, అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడంలో ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.ఈకార్యక్రమంలో ప్యాపిలి పోలీసుల సిబ్బంది పాల్గొన్నారు.

About Author