ఆలూరు ఎమ్మెల్యే అరెస్టును ఖండించిన ఆస్పరి మండల వైఎస్సార్సీపీ నాయకులు
1 min read
అక్రమ కేసులు ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిపై నమోదైన కేసులు అక్రమమని ఆరోపిస్తూ, ఆయన అరెస్టును తీవ్రంగా ఖండించిన ఆస్పరి మండల వైఎస్సార్సీపీ నాయకులు మంగళవారం ఆస్పరి మండల కేంద్రంలోని ఆర్‌జేఆర్ ఫంక్షన్ హాల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత శనివారం రాత్రి చిప్పగిరి మండలం నేమకల్లు, సంగల గ్రామాల్లో వైఎస్సార్సీపీ–టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణను రాజకీయంగా వక్రీకరించి, ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మరియు ఆయన తనయుడు చంద్రశేఖర్‌పై తప్పుడు ఆరోపణలు మోపి అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు.మహిళల పట్ల వైఎస్సార్సీపీ పార్టీకి, పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి ఎల్లప్పుడూ గౌరవం ఉందని, మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. వైకుంఠం జ్యోతి మెప్పు కోసమే నాగరాజు తన సొంత భార్య గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించాడని, దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయని తెలిపారు.ఎలాంటి సముచిత కారణం లేకుండా అర్ధరాత్రి ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి నివాసానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఆయనతో పాటు పలువురు నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని మండిపడ్డారు. ఎమ్మెల్యేపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేసి, ఆయనతో పాటు అరెస్టు చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మీడియా సమావేశంలో ఆస్పరి జడ్పీటీసీ దొరబాబు, మండల కన్వీనర్ బసవరాజు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కట్టెల గోవర్ధన్, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గుడిసె మహానంది, రాష్ట్ర మేధావుల సెల్ కార్యదర్శి శివానంద, ఆలూరు వైఎస్సార్సీపీ యువజన అధ్యక్షుడు అశోక్, జిల్లా యువజన కార్యదర్శి మసాలా ప్రకాష్, శేషురెడ్డి, జిల్లా బీసీ కార్యవర్గ సభ్యుడు పెద్దయ్య, పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కేశవరెడ్డి, మోహన్, వీరభద్రి, రాజన్న గౌడ్, కౌలుట్లయ్య, రంగన్న, తిక్కయ్య, కన్నా, గోపాల్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేష్, రంగస్వామి తదితర గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


