NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్టును తీవ్రంగా ఖండించిన ఎస్‌డీపీఐ

1 min read

హోళగుంద న్యూస్ నేడు: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్టు ఘటనను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) ఆలూరు అసెంబ్లీ కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రజల విశ్వాసంతో భారీ మెజారిటీతో ఎన్నికైన ఎమ్మెల్యేపై రాజకీయ కక్షసాధింపు ధోరణితో చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎస్‌డీపీఐ ఆలూరు అసెంబ్లీ అధ్యక్షుడు ఎఫ్. అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిపై నమోదైన కేసు, అనంతరం జరిగిన అరెస్టు రాజకీయ ఉద్దేశాలతో జరిగినట్లుగా తమ పార్టీ భావిస్తోందని అన్నారు. ప్రజల తీర్పుతో ఎన్నికైన ప్రజాప్రతినిధిపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అవి చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.అలాగే, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలను ప్రస్తావిస్తూ, వాటిలో కనిపిస్తున్న అంశాలపై కూడా సమగ్రంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏ ఒక్కరి వాదన ఆధారంగా కాకుండా, అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను పరిగణనలోకి తీసుకుని వాస్తవాలను వెలికితీయాలని ఆయన కోరారు.ఎవరిపైనా ఆరోపణలు వచ్చినా చట్టం ముందు అందరూ సమానమేనని, అయితే విచారణ నిష్పక్షపాతంగా, రాజకీయ ప్రభావాలకు అతీతంగా సాగాలని అన్నారు. చట్టాన్ని రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి సాధనంగా ఉపయోగించకుండా రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు.ప్రతీకార రాజకీయాలకు ప్రభుత్వం స్వస్తి చెప్పాలని, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కేసులో అన్ని కోణాల్లో సమగ్ర విచారణ నిర్వహించి, నిజానిజాలను వెలికితీసి చట్ట ప్రకారం న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్‌డీపీఐ ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సలాం, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్, కార్యదర్శి హఫీజ్, కోశాధికారి బి అల్లా బకాష్ పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *