NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మందులు వాడ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆస్తమా తీవ్రత

1 min read

పూర్తిగా డోస్ మొత్తం ఉపయోగిస్తే ఇక సమస్య లేనట్లే

కొన్నాళ్లు వాడి, తర్వాత ఆపేసేవారే 90% ఉంటున్నారు

ఆస్తమా జన్యుపరంగా వచ్చే వ్యాధి.. దాన్ని నివారించలేం

తగిన చికిత్సతో తగ్గించుకోవడమే ఏకైక పరిష్కారం

కామినేని ఆస్పత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ ఇ. రవీంద్రరెడ్డి

 హైద‌రాబాద్, న్యూస్​ నేడు : ఆస్తమా ఉంద‌ని గుర్తించిన త‌ర్వాత కూడా మందులు స‌రిగా వాడ‌క‌పోతేనే దాని తీవ్రత ఎక్కువ అవుతుంద‌ని కామినేని ఆస్పత్రికి చెందిన క‌న్సల్టెంట్ ప‌ల్మ‌నాల‌జిస్ట్ డాక్టర్ ఇ.ర‌వీంద్ర‌రెడ్డి తెలిపారు. అంత‌ర్జాతీయ ఆస్తమా డే సంద‌ర్భంగా ఆయ‌న సీనియర్ కన్సల్టెంట్ ప‌ల్మనాల‌జిస్ట్ డా. సుభాకర్ కంది, కన్సల్టెంట్ ప‌ల్మ‌నాల‌జిస్ట్స్ డా. డి.ఎస్ సౌజన్య మరియు డా. భరత్ జనపాటిలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ దీని ల‌క్షణాలు, చికిత్స విధానాలు త‌దిత‌ర వివ‌రాలు తెలిపారు. “చాలామంది ఒక‌సారి వైద్యుల‌కు చూపించుకున్న త‌ర్వాత అప్పుడు ఇచ్చిన మందునే ఎప్పటికీ వాడ‌డం, లేదా కొన్నాళ్లు వాడి ఆపేయ‌డం చేస్తుంటారు. దానివ‌ల్ల స‌రిగా త‌గ్గదు. అయితే, కొంత‌మంది మాత్రం ఎప్పటిక‌ప్పుడు వైద్యుల‌కు చూపించుకుంటూ వాళ్లు సూచించిన మందులే వాడుతుంటారు. అలాంటివాళ్లకు అస‌లు ఆస్పత్రిలో చేరాల్సిన అవ‌స‌ర‌మే రాదు. ఇక కొంద‌రు వైద్యులు కూడా రోగుల‌తో త‌గినంత స‌మ‌యం వెచ్చించ‌లేక‌పోతున్నారు. దానివ‌ల్ల వారు రోగి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే మందులు ఇవ్వడం, దాంతో అవి స‌రిగా ప‌నిచేయ‌క‌పోవ‌డం లాంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. కామినేని ఆస్పత్రికి అన్ని వ‌య‌సుల రోగులూ వ‌స్తారు. సాధార‌ణంగా ఆస్తమా అనేది చిన్న‌వ‌యసులోనే బ‌య‌ట‌ప‌డుతుంది. కొంద‌రికి యుక్త‌వ‌య‌సులో వ‌స్తుంది. అరుదుగా 60 ఏళ్లు దాటిన‌వారిలోనూ వ‌స్తోంది. దాన్ని వాళ్లు వ‌య‌సుతో వ‌చ్చిన స‌మ‌స్యగా భావించి వ‌దిలేస్తారు. కానీ, జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల వారికి ఆ వ‌య‌సు దాటిన త‌ర్వాతే ఆస్తమా మొద‌ల‌వుతుంది. మా ద‌గ్గర‌కు వ‌చ్చేవారిలో కొంద‌రికి చాలా త‌క్కువగా ఉంటుంది. కొంద‌రికి కేవ‌లం కొన్ని సీజ‌న్లలోనే వ‌స్తుంది. కొంద‌రు పూర్తిగా స్టెరాయిడ్ల మీదే ఆధార‌ప‌డ‌తారు, కొంద‌రికి స్టెరాయిడ్లు అస్సలు ప‌డ‌వు. అలా జ‌రగ‌డం త‌క్కువ.   ఆస్తమా ఉందా లేదా అని తెలుసుకోవ‌డానికి ప‌ల్మన‌రీ ఫంక్షన్ టెస్ట్ (పీఎఫ్‌టీ) చేస్తాం. దానికి మ‌హా అయితే 10 నిమిషాలు ప‌డుతుంది. చికిత్స కూడా చాలా సుల‌భం. రోటో కాప్స్, ఇన్‌హేల‌ర్ లేదా నెబులైజేష‌న్ లాంటివి ఉంటాయి. ఊపిరి పీల్చేట‌ప్పుడు పిల్లికూత‌ల్లాంటివి వ‌చ్చినా, ద‌గ్గు బాగా ఎక్కువ‌గా వ‌స్తున్నా, న‌డిస్తే ఆయాసం వ‌చ్చినా ఆస్తమా ఉంద‌ని అనుమానించాలి. త‌ర్వాత పీఎఫ్‌టీ ప‌రీక్ష చేయించుకుంటే ఆస్త‌మా ఉందా లేదా, ఏ స్థాయిలో ఉంద‌నేది స్పష్టంగా తెలుస్తుంది. ఆస్తమా రాకుండా ఏమీ చేయ‌లేం. వ‌స్తే వెంట‌నే చికిత్స చేయించుకోవాలి. కామినేని ఆస్పత్రిలో స‌గ‌టున ఏడాదికి వెయ్యిమంది వ‌ర‌కు ఆస్తమా బాధితుల‌కు చికిత్సలు చేస్తున్నాం” అని డాక్టర్ ఇ.ర‌వీంద్ర‌రెడ్డి తెలిపారు.

About Author