రెడ్‌క్రాస్ సహ వ్యవస్థాపకులు జీన్-హెన్రీ డ్యూనాంట్ జయంతి
1 min read
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవ వేడుకలు
ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే బడేటి చంటి
హెన్రీ డ్యూనాంట్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: హేలాపురి గర్వించేలా, ప్రతిఒక్కరూ స్ఫూర్తిపొందేలా ఇండియాన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖా ఆదర్శనీయమైన సేవలందిస్తోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు. అంతటి మహత్తరమైన సేవలను మరింత మంది అవసరార్థులకు అందించేలా వాటిని ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకెళ్ళే గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖా కార్యాలయంలో రెడ్‌క్రాస్ సహ వ్యవస్థాపకులు జీన్-హెన్రీ డ్యూనాంట్ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యే చంటికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం ఆయన హెన్రీ డ్యూనాంట్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇదేసమయంలో ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ప్రధానంగా పలువురు దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేయగా,,, వారిని ఎమ్మెల్యే చంటి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే తలసేమియా వ్యాధిగ్రస్తులతో పాటూ వారి బంధువులతో స్వయంగా మాట్లాడిన ఎమ్మెల్యే బడేటి చంటి వారంతా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుండి ఇక్కడకు వచ్చి వైద్యసేవలను పొందుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్నారు. ఈ తరుణంలో రెడ్‌క్రాస్ సేవలను విస్త్రృతం చేస్తోన్న విధానంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణం నుండి చేపట్టిన అవగాహన ర్యాలీని ఆయన జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సంస్థ రోగులకు విలువైన సేవలందించేందుకు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు. గత ఐదేళ్ళ వైసిపి ప్రభుత్వ పాలనలో ఎంతో విశిష్టత కలిగిన రెడ్‌క్రాస్ సేవలను ఎలా పక్కదారి పట్టించారో అందరికీ తెలుసునన్న ఆయన అటువంటి విధానాలకు చెక్‌పెడుతూ స్వేచ్ఛాయుత సేవలకు రెడ్‌క్రాస్‌ను వేదికగా నిలిపేలా పారదర్శక అడుగులు వేశామని చెప్పారు. దీంతో వైద్యసేవలను అందించడంలో రాష్ట్రంలోనే ఏలూరు రెడ్‌క్రాస్ సంస్థ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. వైద్యసేవలు పొందుతున్న వారుసైతం ఇదే అంశాన్ని స్వయంగా తనతో చెప్పడం చూస్తే ఎంతో ఆత్మ సంతృప్తి కలుగుతోందన్న ఆయన ఇదేస్ఫూర్తితో రానున్న రోజుల్లో తాము అందించే సేవా కార్యక్రమాలను సంస్థ ప్రతినిధులు మరింత విస్త్రృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ ఎంబీఎస్వీ ప్రసాద్,ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, సత్యనారాయణ రాజు, బ్రహ్మానంద రెడ్డి, మేతర అజయ్‌బాబు, మోటేపల్లి చంద్రశేఖర్, ఆర్‌ఎన్‌ఆర్ నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ, డాక్టర్ నిహారిక, డాక్టర్ శ్రావణీ లక్ష్మి, డాక్టర్ శాస్త్రి, అడుసుమిల్లి నిర్మల, ఆరోగ్య సిబ్బంది,వివిధ కళాశాలలకు చెందిన నర్సింగ్ విద్యార్ధినులు,ఫార్మసీ విద్యార్ధినులు తదితరులు పాల్గొన్నారు.

