మెగా డిఎస్సీ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో పొరపాట్లు జరగకూడదు
1 min read

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
కర్నూలు, న్యూస్ నేడు: మెగా డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఎలాంటి పొరపాట్లు జరక్కూడదని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.సోమవారం నన్నూరు టోల్ ప్లాజా వద్ద శ్రీనివాస బీఎడ్ కాలేజీ, రాఘవేంద్ర బీఎడ్ కాలేజీ లో మెగా డీఎస్సీ 2025 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించి చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డీఎస్సీ వెరిఫికేషన్ కేంద్రాలకు సర్టిఫికెట్ల పరిశీల నిమిత్తం హాజరయ్యే అభ్యర్థులు ఏ చిన్న సమస్య ఎదుర్కొనడానికి వీల్లేదన్నారు. ఇంటర్నెట్, విద్యుత్ సదుపాయాలకు అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు…నియామక ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల ధ్రువీకరణ కీలకమైనదని, క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సబ్జెక్టు వారీగా ఏర్పాటు చేసిన గదులను కలియదిరిగి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు…ఉమ్మడి జిల్లాల్లో ఎంతమంది అభ్యర్థులు హాజరుకానున్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ధృవీకరణ పత్రాల పరిశీలనలో వచ్చే ఇబ్బందులు, వాటిని ఎలా అధిగమించాలో కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయ్యేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ తెలిపారు.జిల్లా వ్యాప్తంగా 2600 అభ్యర్థులు ఎంపికయ్యారని, సర్టిఫికెట్ల పరిశీలన నిమిత్తం 54 బృందాలను ఏర్పాటు చేశామని, అదనంగా మరో కొన్ని బృందాలు ఉన్నాయని జిల్లా విద్యాశాఖాధికారి కలెక్టర్ కి వివరించారు. ఎంపిక జాబితా రాష్ట్రం నుంచి విడుదల కావలసిన నేపథ్యంలో ఏ క్షణాన వెరిఫికేషన్ కు ఆదేశాలు అందుతాయో వెంటనే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని డిఇఓ కలెక్టర్ కు వివరించారు. కార్యక్రమంలో డిఈఓ శామ్యూల్ పాల్, నంద్యాల డిఈవో జనార్దన్ రెడ్డి, డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


