రేషనలైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయండి
1 min read
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు : జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఈఆర్ఓ, ఎఈఆర్ఓలకు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆమె ఈఆర్ఓలు, రాజకీయ పార్టీ ప్రతినిధులతో రేషనలైజేషన్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియలో ప్రతిపాదించిన కేంద్రాలను స్వయంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం ధృవీకరించి ప్రతిపాదనలు సమర్పించాలని ఈఆర్ఓ, ఎఈఆర్ఓలను ఆదేశించారు. సదరు ప్రతిపాదనలను రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో పునఃపరిశీలన అనంతరం ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపిస్తామన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి ఈఆర్ఓ, ఎఈఆర్ఓ తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా సందర్శించి, సంబంధిత స్కెచ్‌లు సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో నదులు, గుట్టలు దాటలేని లేదా రెండు కిలోమీటర్లకు మించి ప్రయాణించాల్సిన ఓటర్ల కోసం కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 1629 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో ఐదు కేంద్రాల పేర్లను (శ్రీశైలం-4, బనగానపల్లె-1) మార్చడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే 36 పోలింగ్ కేంద్రాల మార్పుకు ప్రతిపాదనలు అందాయని, వీటిలో ఆళ్లగడ్డ-9, శ్రీశైలం-6, నంద్యాల-13, బనగానపల్లె-1, డోన్-7 కేంద్రాలు ఉన్నాయని వివరించారు. పిఆర్‌పి యాక్ట్ 1950, సెక్షన్ 13(బి) ప్రకారం బిఎల్ఓలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్, ఆర్డీఓలు విశ్వనాథ్, నరసింహులు, శివనాగజ్యోతి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులైన కాంగ్రెస్ పార్టీ తరపున సయ్యద్ రియాజ్ బాషా, వైయస్సార్సీపి తరఫున సాయిరాం రెడ్డి, టిడిపి తరఫున ప్రసాద్ రెడ్డి, శివరాం రెడ్డి బిజెపి తరఫున కసెట్టి చంద్రశేఖర్, సిపిఐ తరపున నరసింహులు, బహుజన సమాజ్ పార్టీ తరఫున కె. శ్రీనివాసులు, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

