ఆలూరు ఎమ్మెల్యే అరెస్టును ఖండించిన హొళగుంద ఎస్సీ కాలనీ దళితులు
1 min read
హోళగుంద న్యూస్ నేడు: ఆలూరునియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి అరెస్టును హొళగుంద ఎస్సీ కాలనీ దళితులు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ప్రజాప్రతినిధిని అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు.ప్రజల తరఫున ప్రశ్నించే గొంతును అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులకు గౌరవం, స్వేచ్ఛ ఉండాలని, ప్రజల తరఫున మాట్లాడే నాయకులను వేధించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.ఎమ్మెల్యే బుసినే విరుపాక్షిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆయనను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల కోసం పనిచేసే నాయకులకు అండగా నిలవడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎస్సీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మృత్యుంజయ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను లేవనెత్తినందుకే ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడం బాధాకరమన్నారు. హొళగుంద మండల నాయకులు కొమ్మి సాయిభేష్, దులేప్ వెంకటేష్, ఇసులుకై వీరేష్, మార్లమడికి హనుమేష్ తమ నిరసనను వ్యక్తం చేశారు.చివరగా, హొళగుంద ఎస్సీ కాలనీ దళితులందరూ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షికి అండగా ఉంటామని ప్రకటిస్తూ, ఆయనకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.


