6.29 కోట్ల రూ. వ్యయంతో నిర్మించిన రహదారిని పరిశీలించిన జిల్లా కలెక్టర్
1 min read

గోరుకలు రిజర్వాయర్ రక్షణ పనులు నాణ్యతతో చేపట్టండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: పాణ్యం నుండి గోరుకల్ రిజర్వాయర్ వరకు 6.29 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారి పనులను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గురువారం సాయంత్రం పరిశీలించారు. కొండజుటూరు, గోరుకల్ , ఎస్ కొట్టాల, దుర్వేసి గ్రామాలను కలుపుతూ 13.125 కి.మీ. పొడవున 6.29 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తయిన రహదారి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రహదారి నిర్మాణం వల్ల 4 గ్రామాలకు సులభ రవాణా సౌకర్యం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సంబంధించి రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. రహదారి పనులు నాణ్యత ప్రమాణాలకు లోబడి, సమయానికి పూర్తయ్యేలా అధికారులు కృషి చేసారన్నారు.అనంతరం గోరుకల్లు రిజర్వాయర్ బండ్ పై చేపట్టిన రక్షణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ పనులకు 2.5 కోట్ల రూపాయల నిధులు డిఎంఎఫ్ ద్వారా మంజూరయ్యాయని, అందులో ఇప్పటివరకు 60 లక్షల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాయని ఎస్ఆర్బిసి ఎస్ఈ శుభకుమార్ కలెక్టర్ కు నివేదించారు. రిజర్వాయర్ బండ్ పై రక్షణ పనులు పూర్తయితే నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, సాగు అవసరాలు తీర్చడంతో పాటు స్థానికులకు త్రాగునీటి సౌకర్యం చేకూరుతుందని కలెక్టర్ అన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు, సాగు నీరు, రవాణా సౌకర్యాలు కల్పించడమే ఈ పనుల ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ స్పష్టం చేశారు. పనుల అమలులో ఎటువంటి జాప్యం చోటుచేసుకోకుండా త్వరితి గతిన పూర్తి చేసి ప్రజలకు ఉపయోగకరంగా మార్చాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

