పర్యాటకాభివృద్ధితో జిల్లా స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల
1 min read
పర్యాటక రంగంలో ఉపాధి అవకాశాలకు విస్తృత అవకాశాలు
జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా జిల్లా స్థూల దేశీయోత్పత్తి (GDP) పెరుగుదలతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, ప్రాంతీయ పర్యాటక అధికారి ఓబులమ్మ, జిల్లా పర్యాటక అధికారి విజయలక్ష్మి, టూరిజం కార్పొరేషన్ అధికారి లక్ష్మీనారాయణతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటకాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఇప్పటికే 22 ప్రధాన పర్యాటక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాకు వచ్చే పర్యాటకులు ఎక్కువగా శైవక్షేత్రాల దర్శనానికే పరిమితమవుతున్నారని, ఇకపై వారికి ఆహ్లాదకరమైన వాతావరణం, నాణ్యమైన వసతి, భోజన సదుపాయాలు, వినోదాత్మక కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకువస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం నంద్యాల పట్టణంలో ప్రముఖ ప్రాంతంలో రెండు ఎకరాల భూమిని గుర్తించినట్లు వెల్లడించారు. శ్రీశైలానికి వచ్చే భక్తులు, పర్యాటకుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దైవిక్, వి.టి.ఎస్ హాస్పిటాలిటీ సంస్థలకు కూడా స్థలాల కేటాయింపు జరిగినట్లు కలెక్టర్ చెప్పారు. పర్యాటక ప్రాంతాల ఫోటోలు, ప్రత్యేకతలు హోమ్‌పేజీలోనే స్లైడింగ్ రూపంలో అందుబాటులో ఉంచితే పర్యాటకులను ఆకట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే గత మూడు సంవత్సరాలుగా జిల్లాకు వచ్చిన పర్యాటకుల సంఖ్యపై సమగ్ర డేటా సేకరించి విశ్లేషించాలని సూచించారు. ఇందుకోసం టూరిజం, ఎండోమెంట్స్, ఆర్టీసీ, హోటల్ అసోసియేషన్ల సమన్వయంతో సమాచారాన్ని సేకరించాలని జేసీ తెలిపారు.ప్రతి పర్యాటక ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి స్థానిక స్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. బెలుం గుహలు వంటి ప్రాంతాలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్కూళ్లు, కళాశాలలు ప్రారంభమైన వెంటనే దసరా సెలవులను దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా టూరిజం ప్యాకేజీల ప్రచారం చేపట్టాలని సూచించారు. అటవీ శాఖతో సమన్వయంగా పనిచేస్తే పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో పనుల పునరావృతం లేకుండా సమర్థవంతంగా ముందుకు సాగవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.

