టీజీ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు
1 min read

కర్నూలు,న్యూస్ నేడు: నగరంలోని సంకల్ బాగ్ లో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నివాసంలో దీపావళి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ లతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ నివాసంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని బాణసంచా కాల్చి సందడి చేశారు. దీపావళి వేడుకల నేపథ్యంలో వారి నివాసం సందడిగా మారింది. ప్రత్యేక దీపా అలంకరణలతో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నివాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో వారి కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని దీపావళి వేడుకలను ఆస్వాదించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ దీపావళి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. దీపావళి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు నివాసంతో పాటు లండన్, ముస్లిం దేశమైన ఇండోనేషియాలో కూడా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారని వెల్లడించారు. ఈ దీపావళి వెలుగులు ప్రజల జీవితంలో వెలుగుల నింపాలని ఆయన కోరారు. చెడు పై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా దీపావళి పర్వదినాన్ని జరుపుకోవడం జరుగుతుందని వివరించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూల్ లో పర్యటనకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి దీపావళి వేడుకలు మొదలయ్యాయని వివరించారు. ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న జీఎస్టీ సంస్కరణల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఆర్థిక ఉపశమనం కలుగుతుందని వెల్లడించారు. జీఎస్టీ సంస్కరణల వల్ల అంతిమంగా లాభపడేది ప్రజలు అని ఆయన వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఒక లక్ష 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా బేస్ సెంటర్ ఏర్పాటు చేస్తుందని వివరించారు. దీంతో విశాఖపట్నం గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయిందని తెలియజేశారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు చిరునామాగా మారుతుందని ఆయన వెల్లడించారు. ఇక కర్నూలు విషయానికొస్తే కర్నూలు పారిశ్రామిక వార్డులో ఇప్పటికే 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి కన్ఫర్మేషన్ అయిందని, రానున్న రోజుల్లో మరో 20 నుంచి 30 వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లాంటి విజనరీ లీడర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. దీపావళి వేడుకలను కూడా పక్కనపెట్టి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ప్రజల కోసం కృషి చేస్తున్నారని, గతంలో దసరా పర్వదినం సందర్భంగా తన స్థానికంగా ఉండకుండా జపాన్ పర్యటనకు వెళ్లి పెట్టుబడుల కోసం కృషి చేశానని వెల్లడించారు.

