NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా.ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి

1 min read

రోగుల నుండి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవు

జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్​ నేడు : డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద  రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, రోగుల నుండి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో జిల్లా  కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు ఉచితంగా వైద్యం అందించే పథకమని, రోగుల నుండి డబ్బు తీసుకోవడం సముచితం కాదని కలెక్టర్ తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని, కమర్షియల్ పద్ధతిలో ఆలోచన చేయకూడదని కలెక్టర్ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఆదేశించారు.. ఆసుపత్రికి ఎవరైనా రోగులు వచ్చినప్పుడు వారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు మర్చిపోయిన ఎడల వారిని ముందుగా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎన్రోల్  చేసి ఉచితంగా ఓపి పరీక్షలు నిర్వహించాలని  కలెక్టర్ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఆదేశించారు.ఆసుపత్రి యాజమాన్యాలు రోగుల నుండి డబ్బు తీసుకుంటున్నట్లు  ఐవిఆర్ఎస్   ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణలో తేలిందన్నారు.. నగరంలోని అమీలియో, ఏం ఎస్ ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, స్టార్ కేర్, ఒమేగా ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగుల  నుండి డబ్బులు తీసుకుంటున్నట్లు ప్రజల నుండి  ఫిర్యాదులు అందాయన్నారు… ప్రజల నుండి ఫిర్యాదులు రాకుండా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ఆసుపత్రుల యాజమాన్యాలకు సూచించారు.. ఏం ఎస్ ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వారు సమావేశానికి హాజరు కానందున నోటీస్ ఇవ్వాలని కలెక్టర్ ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ ను ఆదేశించారు.. ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వం నుండి పెండింగ్ లో ఉన్న బకాయిలకు సంబంధించి డిఓ లెటర్ సిద్ధం చేయాలని కలెక్టర్ ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ ను ఆదేశించారు..సమావేశంలో ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ డా.ఎంవిఎన్ఎస్వి.భాస్కర్ రెడ్డి, ఇంచార్జి డి ఎం హెచ్ ఓ డా.లలిత దేవి, డిసిహెచ్ఎస్ డా.జఫ్రుల్లా ,  ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పాల్గొన్నారు.

About Author