గాయత్రీ గోశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా.. దేవాదాయశాఖ మంత్రి
1 min read

వెయ్యి గోవులున్న గోశాలలో ప్రదక్షిణ చేయడం అదృష్టం
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగర శివారులోని గాయత్రీ గోశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి చెప్పారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్‌తో కలిసి ఆయన గాయత్రీ గోశాలను సందర్శించారు. ముందుగా గో సహస్త్ర గోప్రదక్షిణ చేసి గోమాత ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా వెయ్యికి పైగా గోవులున్న గోశాల లేదని చెప్పారు. గోశాల నిర్వహణకు ప్రభుత్వం తరుపున సహకారం అందించాలని దేవాదాయ శాఖ మంత్రిని కోరారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వెయ్యికిపైగా గోవులున్న గోశాలను సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గోశాల నిర్వహణకు తన సొంత నిధులు వెచ్చిస్తున్న మంత్రి టీజీ భరత్‌ను ఆయన అభినందించారు. ప్రభుత్వం నుండి తప్పకుండా గోశాలకు సహకారం అందిస్తానని ఆయన చెప్పారు. అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడును కలిసి చర్చిస్తానన్నారు. టీటీడీ నుండి అవసరమైన సహకారం అందించేందుకు మాట్లాడతానన్నారు. ఇక గాయత్రీ గోశాల పక్కనున్న స్థలం గోశాలకు కేటాయించే విషయంలో అధికారులతో మాట్లాడతానని చెప్పారు. దీంతో పాటు కర్నూలు నగరంలోని దేవాదాయశాఖ గోశాల పక్కనున్న స్థలం కూడా గాయత్రీ గోశాల నిర్వహణకు ఆర్థికంగా ఉపయోగపడేలా ఏ విధంగా చేయాలో ఆలోచన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గాయత్రీ గోశాల అధ్యక్షుడు జగదీష్ గుప్త, సెక్రటరీ ఇల్లూరు లక్ష్మయ్య, ట్రెజరర్ ఇల్లూరు రాజ్యలక్ష్మి, విజయ కుమార్, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


