ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి కార్పొరేటర్ పనిచేయాలి
1 min read
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తించి గెలిపించారు
గెలుపొందిన కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి టీజీ భరత్
కర్నూలు , న్యూస్నేడు: ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలో విజయం సాధించిన పలువురు నూతన కార్పొరేటర్లు బుధవారం మంత్రి టీజీ భరత్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమను గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి ఒక్కరూ అంకితభావంతో ప్రజాసేవ చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఆదరించి కూటమికి మద్దతుగా నిలిచారని అన్నారు. నగరంలోని ప్రతి వీధిలో సమస్యలను గుర్తించి పరిష్కరిస్తూ, అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేరవేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు గుర్తించి తమపై ఈ బాధ్యతను ఉంచారని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు. పదవి అనేది ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశమని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు పాల్గొన్నారు.



