NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

1 min read

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం

జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్

కర్నూలు,న్యూస్​ నేడు: వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని  జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని కేవిఆర్ కళాశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవం–2025 సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహించిన వినియోగదారుల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినియోగదారుల ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.., డిసెంబర్ 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా జాతీయ వినియోగదారుల వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రతి వ్యక్తి రోజువారి జీవితంలో వివిధ వస్తువులు, సేవలను వినియోగిస్తున్నందున వినియోగదారులు తమకు చట్టపరంగా కలిగిన హక్కులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని సూచించారు. నాణ్యమైన వస్తువులు, సరైన సేవలను పొందడం ప్రతి వినియోగదారుడి హక్కు అని తెలిపారు. లోపభూయిష్టమైన వస్తువులు లేదా నాణ్యతలేని సేవలు అందించిన సందర్భాలలో వినియోగదారుల పరిరక్షణ చట్టం–2019 ప్రకారం సంబంధిత వినియోగదారుల ఫోరమ్‌లను ఆశ్రయించి న్యాయం పొందవచ్చని పేర్కొన్నారు. అనంతరం వినియోగదారుల హక్కులపై నిర్వహించిన వ్యాస రచన, ప్రశ్నోత్తర, పరీక్షా పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జేసీ బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి ఎం. రాజా రఘువీర్, డిఎం సివిల్ సప్లై వెంకట రాముడు, జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యులు నజ్మా కౌసర్,నారాయణ రెడ్డి, రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ లాలేప్ప, తూనికల శాఖ డిప్యూటీ కంట్రోలర్  దయాకర్ రెడ్డి, అసిస్టెంట్ కంట్రోలర్ ఫుడ్ సేఫ్టీ కూర్మనాయక్, అసిస్టెంట్ కమిషనర్ కమిషన్ టాక్స్ కైక, జిల్లా సైన్స్ అధికారి రంగమ్మ, జిల్లా కార్యదర్శి వినియోగదారుల రక్షణ మండలి శివ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author