రోడ్డు వెంబడి కంపచెట్లతో రైతులు, ప్రజల ఇక్కట్లు
1 min read

చెన్నూరు , న్యూస్ నేడు: మండలంలోని రామనపల్లె లోఎర్రకాలువ రోడ్డు వెంబడి కంప చెట్లు పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో అక్కడికి వెళ్లే బాటసారులకు, రైతులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కంప చెట్లు ఏపుగా పెరగడంతో అవి దారిన పోయె ప్రజలకు తగలడం తో తీవ్ర గాయాలు కావడం జరుగుతున్నదని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కంపచెట్లతోపాటు పిచ్చి మొక్కలు కూడా దట్టంగా పెరగడంతో అక్కడ విష పురుగులు కూడా ఉండడంవల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో నని ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అక్కడి ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులకు, అధికారులకు చెప్పినప్పటికీ వారు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ప్రజాప్రతినిధుల, అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆ దారి వెంట రైతులు తమ పొలాలకు రాత్రిపూట వెళ్లాలంటే చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. రైతులు ఎక్కువగా ఈ రహదారి గుండానే పశువులకు పచ్చి గడ్డి తెచ్చుకోవాలన్న, తమ పొలాల నుండి ధాన్యాన్ని తోలుకోవాలన్న వెళ్లడం జరుగుతుందని అలాంటి రహదారి గుండా ఇలా ఏపుగా కంప చెట్లు పిచ్చి మొక్కలు మొలిచిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఎంతవరకు సబబు అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కంపచెట్లు తొలగించే విధంగా కృషి చేయాలని రామనపల్లె ప్రజలు కోరుతున్నారు.

