NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతులు బహుళ పంటల  సాగు విధానాన్ని అనుసరించండి 

1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​ నేడు : బహుళ పంటల విధానాన్ని అనుసరించడం ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకుని స్థిరమైన ఆదాయం పొందవచ్చని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సూచించారు.బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఉల్లి సాగుకు సమాయత్తం అయ్యే రైతన్న  – ఒక చిన్న మాట అనే పోస్టర్ ను  కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది ఎర్లీ ఖరీఫ్, ఖరీఫ్ సీజన్లలో రైతులు అధికంగా ఏక పంటగా ఉల్లి సాగు చేయడం వల్ల, అధిక వర్షాల ప్రభావంతో గడ్డల పరిమాణం తగ్గడం, నీటి నిల్వ కారణంగా గడ్డలు కుళ్లిపోవడం వంటి సమస్యలు తలెత్తాయన్నారు. దీనివల్ల నాణ్యత లోపించి రైతులు నష్టపోయారన్నారు.  అందువల్ల  పొలం మొత్తం కేవలం ఉల్లి పంటనే వేయడం వల్ల మార్కెట్ ఒడిదుడుకుల వల్ల నష్టం కలిగే అవకాశం ఉంటుందని, దీనికి బదులుగా బహుళ పంటల విధానాన్ని ఎంచుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కూరగాయలు, పూల సాగు, వేరుశనగ వంటి పంటలను ఎత్తైన మడులపై డ్రిప్ మరియు మల్చింగ్ విధానంలో సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. రైతు ఆదాయానికి భరోసా కల్పించేందుకు గాను పత్తి + పెసర, కంది + వేరుశనగ, మిరప + బంతిపూలు (పొలం చుట్టూ కంచె పంటగా మొక్కజొన్న/జొన్న), టమోటా + బంతిపూలు లాంటి మిశ్రమ పంటల కలయికలను పాటించాలన్నారు. ఒకవేళ ఉల్లి సాగు చేయాలనుకుంటే, పొలాన్ని సమ భాగాలుగా విభజించి ఉల్లితో పాటు వాము, ఎండుమిర్చి, మొక్కజొన్న వంటి పంటలను కలిపి సాగు చేయాలన్నారు. అధిక దిగుబడినిచ్చే రకాలను మాత్రమే ఎంచుకోవాలన్నారు. ఎత్తైన మడులపై డ్రిప్ లేదా స్ప్రింక్లర్ విధానం ద్వారా ఉల్లి సాగు చేయాలన్నారు. పంటల ఎంపిక విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే  ఉద్యాన లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించవలసిందిగా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి రాజాకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *